
- గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసిన మైలారం గ్రామ మాజీ సర్పంచ్ అరకిల ప్రసాద్, మాజీ ఎంపిటిసి గడిపే విజయ విజయ్ కుమార్
Action should be taken against the leaders of the ruling party : హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మైలారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అరికెల ప్రసాద్ మాజీ ఎంపిటిసి గడిపే విజయ విజయ్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదు చేయడం జరిగినదని తెలియజేశారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ గ్రామంలోని దళితుల వ్యవసాయ భూమిని మరియు స్మశాన వాటిక లోని కొంత భూమిని బుచ్చిరెడ్డి ఆక్రమించుకున్నాడని అంతేగాక హుస్సేన్ పల్లి నుంచి మైలారం గ్రామం వరకు జరుగుతున్న చెరువు కట్ట మరమ్మత్తు పనులను నిలిపివేశారని చెరువు కట్టను జెసిబి తో తవ్వించి కొంత భూమిని తన వ్యవసాయ భూమిలో కలుపుకున్నాడని తెలియజేశారు. దళితులకు మాయమాటలు చెప్పి వారికి సంబంధించిన కొంత భూమిని కొనుగోలు చేశాడని వారి వద్ద నుండి కొనుగోలు చేసిన భూమి కాకుండా మిగిలిన కొంత భూమిని కూడా అక్రమంగా కబ్జా చేసి నా పేరు మీద పట్టా చేయాలని స్థానికంగా ఉన్న ఎమ్మార్వోను అధికార బలంతో బెదిరించడం జరుగుతుందని అన్నారు. ఇదేంటి అని అడిగిన దళితులను అక్రమంగా కేసులు బనాయించి బెదిరించుచున్నాడని తెలియజేశారు. సాగుభూమి పక్కనే ఉన్న పిల్లకాలువను సైతం ఆక్రమించాడని అధికార పార్టీ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అండదండలతో ఈ చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు అక్రమంగా ఆక్రమించుకున్న భూమిపై సర్వే చేసి స్మశాన వాటిక మరియు చెరువు కట్టకు హద్దులు కేటాయించి బుచ్చిరెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దూదిపాల తిరుపతిరెడ్డి, దూదిపాల రాజిరెడ్డి, హరిజల సాంబ రెడ్డి, నూనె కిరణ్, తదితరులు పాల్గొన్నారు.