
లెప్రసీ, పల్స్ పోలియో, టిబి బకాయి పారితోషికాలు చెల్లించాలి
పని భద్రత కల్పిస్తూ ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలి
సామాజిక భద్రత కల్పిస్తూ నెలకు పదివేల రూపాయలు పెన్షన్ గా చెల్లించాలి
ఆశాలను కార్మికులుగా గుర్తించి కార్మిక చట్ట పరిధిలోకి తేవాలి
ఆశా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి డిమాండ్
“ఆశా”లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, డిమాండ్లను నెరవేర్చాలని ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి ఆధ్వర్యంలో బుధవారం వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చినగారి రాణి అధ్యక్షతన ధర్నా కార్యక్రమం చేయడం చేపట్టారు. ధర్నాను ఉద్దేశించి కాసు మాధవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, లెప్రసి, పల్స్ పోలియో, టిబి బకాయి పారితోషికాలు వెంటనే చెల్లించాలని ఇతర సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు గత 20 ఏండ్లుగా పనిచేస్తున్నారని, వీరు మాతా శిశు మరణాల రేటు తగ్గించడంలో, ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో ప్రజలకు ఆరోగ్య వ్యవస్థకు మధ్య వారధిగా పని చేస్తున్నారని అయినా ప్రభుత్వం వీరి సమస్యలను పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. ఆశాలు కోరుతున్నది గొంతెమ్మ కోర్కెలు కాదని, వీరికి గౌరవ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చేముందు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని వెంటనే ఆ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం ఆశాల రిప్రజెంటేషన్ కలెక్టర్ కు అందించారు. పై సమస్యలపై కలెక్టర్ స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి ఆశల సమస్యలను తీసుకెళ్తామని హామీ ఇచ్చారని ఆశా యూనియన్ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అద్యక్ష, కార్యదర్శులు మాలోతు సాగర్, ముక్కెర రామస్వామి, ఆశా జిల్లా కార్యదర్శి చైతన్య నాయకులు కళ్యాణి, సుజాత, రజిని, కవిత, మల్లీశ్వరి, రమ, మాధవి, మంజుల, తదితరులు పాల్గొన్నారు.