A ‘three-wheeler scooty’ mall in the Bhupalapally Disabled Department : రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల రవాణా కష్టాలను తీర్చేందుకు మంజూరు చేస్తున్న త్రీవీలర్ స్కూటీల పంపిణీ భూపాలపల్లి జిల్లాలో వివాదాస్పదంగా మారింది. జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం వేదికగా గోల్ మాల్ జరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్హులైన వారికి అసలు అందుతున్నాయా లేదా అనే అనుమానాలను పలువురు అర్హత కలిగిన దరఖాస్తు దారులే అభిప్రాయపడటం అనుమానాలకు తావిస్తోంది. కార్యాలయంలో తెరవెనుక చక్రం తిప్పుతూ అనర్హులకు, సిఫార్సులు ఉన్న వారికే వాహనాలు కట్టబెడుతున్నారనే విమర్శలు వినిపిస్తుండటం గమనార్హం.
A ‘three-wheeler scooty’ mall in the Bhupalapally Disabled Department..!?
ఈ పంపిణీ ప్రక్రియలో పారదర్శకత అనేది అస్సలు కానరావడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాను నోటీసు బోర్డులో ఉంచాలి. కానీ ఇక్కడ అధికారులు అన్ని వివరాలను రహస్యంగా ఉంచుతున్నారని పలువురు దరఖాస్తు దారులు వాపోతున్నారు.
జిల్లాలో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు..? వారిలో ఎంతమంది అర్హులు..? అనే వివరాలను అధికారులు వెల్లడించకపోవడమే ఇక్కడ అనుమానాలకు తావిస్తోంది. తమ దరఖాస్తు స్థితి గురించి అడిగే వికలాంగులకు అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతూ వెళ్లగొడుతున్నట్లు పలువురు పేర్కొనటం గమనార్హం. “పై నుంచి లిస్టు రాలేదు” లేదా “వచ్చినప్పుడు చెప్తాం” అంటూ కాలయాపన చేయడం వెనుక అసలు అంతర్యమేమిటి..? దరఖాస్తు చేసుకున్న వారికి కనీసం వారి పేరు లీస్టులో వచ్చిందో లేదో కూడా తెలుసుకునే వెసులుబాటు ఇవ్వకపోవటం ఆ శాఖ పట్ల అనుమానాలకు అవకాశం కల్పిస్తున్నది.
A ‘three-wheeler scooty’ mall in the Bhupalapally Disabled Department..!?
నిబంధనల అర్హత కలిగిన వైకల్యం ఉండి, చదువుకునే విద్యార్థులు లేదా స్వయం ఉపాధి పొందే వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ భూపాలపల్లిలో సీన్ రివర్స్ అయిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు రాజకీయ సిఫార్సులు ఉన్న వారికి, గతంలోనే లబ్ధి పొందిన వారికి మళ్లీ వాహనాలు అందుతున్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ పంపిణీ ప్రక్రియపై పూర్తిస్థాయి విచారణ జరగాలని పలువురు వికలాంగులు, వికలాంగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో ఎంతమందికి స్కూటీలు మంజూరయ్యాయి..? ఎంపిక చేసిన లబ్ధిదారుల పూర్తి వివరాలను పబ్లిక్ డొమైన్లో ఎందుకు ఉంచలేదు..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
A ‘three-wheeler scooty’ mall in the Bhupalapally Disabled Department..!?
జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి
అవయవ లోపంతో ఇబ్బంది పడుతున్న వారి ఆశలపై నీళ్లు చల్లడం అమానుషం. ఈ గోల్మాల్పై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి సమగ్రమైన విచారణ జరిపి పారదర్శకంగా ప్రక్రియ సాగేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
