- విషాదంలో సిద్ధార్థ నగర్..
- రోడ్డు ప్రమాదంలో ఫాతిమా ఐటిఐ లెక్చరర్ రాకేష్ మృతి
A tearful farewell to ‘Rakesh’ : హనుమకొండ సిద్ధార్థ నగర్‌కు చెందిన యువ లెక్చరర్, టెక్నీషియన్ పరపాటి రాకేష్ (28) అంతిమయాత్ర సోమవారం అత్యంత విషాదకర వాతావరణంలో, అశేష జనవాహిని మధ్య జరిగింది. నిన్న తెల్లవారుజామున కటాక్షపురం చెరువు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాకేష్ ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీరని లోటు ఏర్పడింది.
A tearful farewell to ‘Rakesh’
ఫాతిమా ఐటిఐ కాలేజీలో గత ఎనిమిదేళ్లుగా లెక్చరర్‌గా, టెక్నీషియన్‌గా పనిచేస్తున్న రాకేష్, విద్యార్థులతో కేవలం అధ్యాపకుడిలా కాకుండా ఒక అన్నయ్యలా, సోదరభావంతో మెలిగేవాడు. ఆయన మరణవార్త విన్న ఐటిఐ సిబ్బంది, క్యాథలిక్ సిస్టర్స్ వందలాది మంది విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. అంతిమయాత్ర పొడవునా విద్యార్థులు తమ ప్రియతమ గురువును స్మరించుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. రాకేష్ కుటుంబం ఇప్పటికే తీరని కష్టాల్లో ఉంది. ఇటీవలే తండ్రి మరణించగా, ఇప్పుడు ఒక్కగానొక్క కుమారుడు కూడా దూరమవ్వడంతో తల్లి పరపాటి వినోద పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. ఇంటికి చేదోడువాదోడుగా ఉంటాడనుకున్న కొడుకు కళ్ల ముందే కాలగర్భంలో కలిసిపోవడంతో ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.
A tearful farewell to ‘Rakesh’
రాకేష్ కుటుంబ పరిస్థితిని గమనించిన ఐటిఐ ప్రిన్సిపాల్ ఫాదర్ ప్రేంసాగర్, సిద్ధార్థ నగర్, బాబు క్యాంపు పెద్దలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పందించి, దిక్కులేని స్థితిలో ఉన్న రాకేష్ తల్లి వినోదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ఆ కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని వివిధ సంఘాల నేతలు కోరారు. ఒక క్రమశిక్షణ కలిగిన అధ్యాపకుడిగా, ఉత్తమ సాంకేతిక నిపుణుడిగా గుర్తింపు పొందిన రాకేష్ మరణం ఫాతిమా ఐటిఐ సంస్థకు, సిద్ధార్థ నగర్ ప్రాంతానికి తీరని లోటుగా పలువురు భావిస్తున్నారు.
