
- ఛత్తీస్ ఘడ్ లో మరో ఎన్ కౌంటర్
- ఇద్దరు జవాన్లు, 31 మంది మావోయిస్టులు మృతి
Maoists Encounter తుపాకులు ఘర్జిస్తున్నాయ్. గత కొంతకాలంగా అరణ్యంలో అన్నలను వేటాడుతున్నారు. వరుస ఎన్ కౌంటర్లతో అడవి దద్దరిల్లుతోంది. అటు రాజ్యం ఇటు మావోయిస్టుల మధ్య సాగుతున్న సాయుధ యుద్ధంతో రక్తం ఏరులై పారుతోంది. ఎన్ కౌంటర్ల పరంపరలో మరోసారి భారీ ఎన్ కౌంటర్ (Encounter) కొనసాగుతోంది. బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల (Maoists) మధ్య ఆదివారం ఉదయం మొదలైన కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు కొనసాగుతున్న ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు, 31 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది.
Encounter
మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లు ఇద్దరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. భద్రతాబలగాలు ఓ వైపు మావోయిస్టుల కోసం వేటాడుతూనే మరోవైపు మృతిచెందిన మావోయిస్టులు ఎవరో గుర్తించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
వెస్ట్బస్తర్ డివిజన్లో మావోయిస్టులు ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీస్ బృందం నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో సోదాలు జరుపుతుండగా ఎన్కౌంటర్ జరిగినట్లు బస్తర్ రేంజ్ ఐజి సుందర్రాజ్ తెలిపారు. ఆదివారం ఉదయం నుండి మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య అడపాదడపా కాల్పులు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్), కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్)తో పాటు రాష్ట్ర పోలీసులు, జిల్లా రిజర్వ్గార్డ్ మరియు స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాలు శుక్రవారం నుండి సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నట్లు తెలిపారు.