
- గద్దర్ ను అవమానించడం విచారకరం
- బండి సంజయ్ ని తెలంగాణ నుంచి తరిమికొడతారు ప్రజలు
- బీజేపీకి పని చేస్తేనే అవార్డులు ఇస్తారా..?
- సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలి
- పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాదాసి శ్రీధర్
ప్రజా యుద్ధ నౌక గద్దర్ పట్ల అవమానకరంగా మాట్లాడిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ను మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాదాసి శ్రీధర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర యూత్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం పరకాల పట్టణ కేంద్రంలో మండల యూత్ అధ్యక్షుడు దొమ్మటి కృష్ణకాంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన యూత్ కాంగ్రెస్ సమావేశంలో నియోజకవర్గ అధ్యక్షుడు మాదాసి శ్రీధర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. బండి సంజయ్ మాటలు గల్లీ లీడర్ కంటే హీనంగా ఉన్నాయని ఎద్దేవ చేశారు. గద్దర్ తన ఆటపాటలతో తెలంగాణ వాదాన్ని, ఉద్యమాన్ని ఉర్రూతలూగించారన్నారు.తన జీవితం మొత్తం పేద, బడుగు, బలహీన వర్గాల కోసం, తెలంగాణ కోసం త్యాగం చేశారన్నారు. అమరుడిని పట్టుకొని అవమానకరంగా మాట్లాడడం బండి కున్న సంస్కారనికి నిదర్శనం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర మరువలేనిదని, తెలంగాణ సంస్కృతి, కళలు,గద్దర్ పాటలు, కవితల్లో ప్రతిబింబిస్తాయని గద్దర్ మరణించినప్పుడు ప్రధాని మోడీ పంపిన సంతాప లేఖలో పేర్కొన్నారని గుర్తు చేశారు. బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, బాధలు గద్దర్ పాటలలో ప్రతిబింబిస్తాయన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, కవితలను పునర్జీవింపజేయడంలో గద్దర్ పాత్ర మరువలేనిదన్నారు.ఆయన కృషి ఎప్పటికీ నిలిచిపోతుందని కొనియాడారు. దేశ ప్రధానని నరేంద్ర మోడీనే గద్దర్ సేవలను కొనియాడితే తెలంగాణలో పుట్టి, తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన సంజయ్ గద్దర్ గురించి మాట్లాడడం దుర్మార్గమని మండిపడ్డారు . తెలంగాణ ను అవమానించిన సంజయ్ కు తెలంగాణలో ఉండే అర్హత లేదన్నారు. తెలంగాణలో ఉండాలంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాదాసి శ్రీధర్ డిమాండ్ చేశారు.
ఈ యొక్క సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్యామ్, ఆత్మకూరు మండల యూత్ అధ్యక్షుడు తనగుల సందీప్, దామెర మండల యూత్ అధ్యక్షుడు నల్ల సుధాకర్, పరకాల మండల యూత్ ఉపాధ్యక్షులు సిలువేరు రాఘవ,పోలేపాక ప్రశాంత్,బాగాది రమేష్ తదితర యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.