
- నిశ్శబ్ధ హెచ్చరిక చేస్తున్న “బస్తర్ జంక్షన్” జర్నలిస్టు దారుణ హత్య ఘటన…
- బెదిరించడానికి చంపడమే అంతిమ వ్యూహంగా ఉంటున్న వైనం….
- ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులకు, ఫీల్డ్ రిఫొర్టర్లకు కరువైన రక్షణ…
- మోసపూరిత కాలంలో జర్నలిస్టులు సత్యం వైపే నిలబడాలి..!
- జర్నలిస్టులకు రక్షణ చట్టం చేయాలి….
- ఛత్తీస్ ఘడ్ జర్నలిస్టు “ముఖేష్ చంద్రకర్” ను హత్యచేసిన దండుగులను చట్టపరంగా శిక్షించాలి
Journalist Mukesh chendrakar killed జర్నలిస్టులకు, ముఖ్యంగా ఫీల్డ్ రిపోర్టింగ్ చేసేవారికి, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో నిమగ్నమైన వారికి రక్షణ కరువైంది. జర్నలిస్టులను “నిశ్శబ్దం” చేయడానికి అన్ని రకాల హస్త్రాలను ఉపయోగిస్తున్నారు. చివరగా బెదిరించడంలో చంపడమే అంతిమ వ్యూహంగా ఉంటుంది. అలాంటి అంతిమ వ్యూహాన్ని ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో ఫ్రిలాన్స్ జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ పై ప్రయోగించారు. 33ఏళ్ల యువ జర్నలిస్టును అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన యావత్తు జర్నలిస్టు సమూహాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
రోజురోజుకూ జర్నలిస్టులు, మీడియా సంస్థలపై దాడులు పెరిగిపోతున్నాయి. భావప్రకటనా స్వేచ్చా హక్కును వినియోగించుకోవడానికి ఏమాత్రం సాహసోపేతమైన అడుగు ముందుకు పడినా బెదిరింపులు, కేసులు, జైలు శిక్షలు, రాజద్రోహాలు స్వాగతం పలుకుతున్నాయి. రాజ్యమో, రాజ్యం అండతో రాజ్యమేలే గుంపులో ఇలాంటి చర్యలకు పాల్పడటం సర్వసాధారణంగా మారింది. ఒక రకంగా జర్నలిస్టులను నిశ్శబ్దం చేసే ప్రక్రియ చాలా పకడ్బందీ ప్రణాళికతో సాగుతున్నది. భయపెట్టే వ్యూహాలలో అంతిమ వ్యూహంగా జర్నలిస్టులను చంపేసేందుకు వెనుకాడటం లేదు. ఇందుకు ఈ ఏడాది ప్రారంభంలోనే ఛత్తీస్ గడ్ లో జరిగిన ఈ యువ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ హత్య ఉదాంతం.
33ఏళ్ల వయస్సు కలిగిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ జనవరి 1న అదృశ్యమై బీజాపూర్ పట్టణంలోని సెప్టిక్ ట్యాంక్‌లో అతని మృతదేహం జనవరి 3న కనుగొనబడింది. ఇంతకీ ఆ జర్నలిస్టు చేసిన నేరం ఏమిటి..? ఛత్తీస్‌గఢ్‌లోని రోడ్డు నిర్మాణంలో అవకతవకలను ఎత్తిచూపారు. ఇదే ఆయన చేసిన నేరం.
రూ. 120 కోట్ల విలువైన కాంట్రాక్ట్‌లో అవినీతిని బయటపెట్టారని, జర్నలిస్ట్ ముఖేష్‌ను దారుణంగా హత్య చేశారు. అతడిని హంతకులు దారుణంగా హింసించి చంపేసినట్లు రిఫొర్ట్లు పేర్కొంటున్నాయి. గుండెను చీల్చి బయటకు తీశారని, కాలేయాన్ని నాలుగు ముక్కులు చేశారని, అతడి పక్క టెముకులు ఐదు చోట్ల, తలపై 15 చోట్ల ఎముకలు విరిగిపోయాయని, ఈ విషయాలన్నీ పోస్ట్‌మార్టం నివేదికలో స్పష్టం కావడం, సీనియారిటీ కలిగిన వైద్యులే తమ వైద్య వృత్తిలో ఈ తరహా హత్యను ఇప్పటి వరకు చూడలేదంటూ ఈ పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యులు సైతం స్పష్టం చేశారంటే ఈ హత్యను ఎంత పాశవికంగా చేశారో అర్థమవుతోంది.
సత్యాన్ని కనుగొనాలని పట్టుదలతో, ఆ సత్యాన్ని అధికారంతో మాట్లాడటం జర్నలిజం యొక్క సారాంశంగా ఉంటుందనడంలో సందేహం లేదు. “జర్నలిస్ట్‌గా, రాయడం, మాట్లాడటం ఈ సమాజంలో ఉన్న విభిన్న పరిస్థితులను, సంఘటనలను విశ్లేషించడం అర్థం చేసుకోవడం, సమాజానికి సమాచారం అందించడం జర్నలిస్టు పనిగా ఉంటుంది. ఈ తరహా పనినే ముఖేష్ చంద్రకర్ నిర్వర్తించారు. ఆయన ఎన్డిటివి న్యూస్ ఛానెల్‌కు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పనిచేశారు. దాదాపు 1.59 లక్షల మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉన్న “బస్తర్ జంక్షన్” అనే యూట్యూబ్ ఛానెల్ ను నిర్వహించారు. ఒకానొక సందర్భంలో 22 మంది భద్రతా సిబ్బంది మరణించిన బీజాపూర్‌లోని తకల్గూడ నక్సల్ ఆకస్మిక దాడి తరువాత ఏప్రిల్ 2021లో మావోయిస్టు చెర నుండి కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్‌ను విడుదల చేయడంలో అతను కీలక పాత్ర పోషించాడనేది రికార్డులు పేర్కొన్నాయి. అలాంటి ముఖేష్ చంద్రకర్ దారుణ హత్య ఏం చెప్తోంది..? ఒకరకంగా జర్నలిస్టులను నిశ్శబ్దం చేసే అంతిమ వ్యూహం చంపడమే అనే హెచ్చరిక జారీ చేస్తుందనేది ఇక్కడ గమనించాల్సిన సత్యం. ప్రజాస్వామ్యానికి ఉత్తమ రక్షణగా ఉండే జర్నలిస్టులు
ఒకరకంగా చీకటి నీడల మధ్య అప్రకటిత ఎమర్జెన్సీలో మునుపెన్నడూ లేని విధంగా తమ వృత్తిని కొనసాగించాల్సిన వస్తోంది. సత్యానంతర యుగంలో, సత్యం వైపు నిలబడాలని, నిలకడగా నిక్కచ్చిగా ఉండే జర్నలిస్టులు మార్కెట్ శక్తులకు లొంగిపోవడాన్ని లేదా మీడియా మార్కెట్ నుండి తరిమివేయబడడాన్ని ఎంచుకోవలసి వస్తోంది. ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఈనేపథ్యంలో “మోసపూరిత కాలంలో నిజం చెప్పడం సాహసోపేతమైన చర్య అయినప్పటికీ జర్నలిస్టులు సత్యం వైపే నిలుస్తారని ఈ సమాజం ఉల్లిక్కిపడేలా మరింత పదునుగా అక్షర సమరం చేస్తారని చాటిచెప్పాల్సిన అవసరం ఉంది. ముఖేష్ చంద్రకర్ హత్య చేసిన దోషులను చట్టపరంగా శిక్షించాలనే డిమాండ్ ను విస్తృతపరుచాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టులకు, ముఖ్యంగా ఫీల్డ్ రిపోర్టింగ్ చేసేవారికి, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో నిమగ్నమైన వారికి రక్షణ చట్టం కల్పించాల్సిన అవసరం ఉంది.
రాజేందర్ దామెర ( దారా )
ఎడిటర్ – జన నిర్ణయం
jananirnayam2022@gmail.com