
- వర్ధన్నపేట మున్సిపల్ అధికారుల వింత పోకడ…!
- ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ ఆస్తిని కూలగొట్టి పర్మిషన్ ఇస్తున్న అధికారులు…
- చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు…
- ఆందోళనలకు సిద్ధపడుతున్న ప్రజాసంఘాలు…
- కలెక్టర్ కు ఫిర్యాదు చేసే యోచనలో
- మాదిగల ఐక్య సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మిద్దెపాక రవీందర్
- నిరాహార దీక్షలకు సైతం ప్రజాసంఘాలు సిద్ధపడుతున్నట్లు సమాచారం
Warangal district వరంగల్ జిల్లా wardhannapet municipality వర్ధన్నపేట మున్సిపాలిటీలో గమ్మత్తైన వ్యవహారం సాగుతోంది. అక్కడి మున్సిపల్ అధికారుల తీరే సెపరేట్ గా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా ప్రయివేట్ కట్టడాల కోసం ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వింతైన పనికి శ్రీకారం చుట్టారు.
Wardhannapet municipality వర్ధన్నపేట మున్సిపాలిటీ ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై నిర్మించిన డివైడర్ ను ప్రయివేటు వ్యక్తుల కోసం అక్రమంగా తొలగించడం బహిరంగ రహస్యంగా మారింది. వర్ధన్నపేట నియోజకవర్గం నూతనంగా మున్సిపాలిటీ అయిన తర్వాత రహదారుల విస్తరణ సుందరీకరణలో భాగంగా సుమారు రూ. 2 కోట్ల వ్యయంతో సెంటర్ లైటింగ్, డివైడర్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు.
అయితే కొంతమంది వ్యాపారస్తుల అభివృద్ధి కోసం ప్రయివేటు కట్టడాల కోసం జాతీయ రహదారిలో నిర్మించిన సుమారు 500 మీటర్ల రూ. 50 లక్షల విలువగల డివైడర్లను ఎలాంటి పర్మిషన్లు లేకుండా రాత్రికి రాత్రే తొలగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు అక్కడ తొలగించబడిన డివైడర్ నే సాక్ష్యంగా నిలుస్తోందనేది గమనార్హం. ఇట్టి విషయంలో ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ను కలిసి డివైడర్ ధ్వంసం చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని కోరుతామన్నారు.
మరోవైపు గత రెండు రోజుల కిందటే ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇట్టి దుశ్చర్యపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని మాదిగ ఐక్య సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మిద్దెపాక రవీందర్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇక చిలికిచిలికి గాలివానలాగా ఇట్టి డివైడర్ తొలగింపు వ్యవహారం దహనంలా వ్యాపిస్తోంది. ప్రజాసంఘాలు సైతం జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు దృష్టి తీసుకు వెళ్లేందుకు సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. వర్ధన్నపేట మున్సిపల్ అధికారుల తీరుపై సమగ్రమైన విచారణ చేస్తే అసలు బండారం బయటపడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
- రిలే నిరాహారదీక్షలకు సిద్ధపడుతున్న ప్రజాసంఘాలు..?
ఇట్టి వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేయడానికి ప్రణాళికలు సాగుతున్నట్లు సమాచారం. యధేచ్ఛగా మున్సిపల్ అధికారులు ప్రయివేటు కట్టడానికి ప్రభుత్వ ఆస్తి ధ్వంసం అయినప్పటికీ పట్టించుకోకపోవడం పట్ల అసహనం వ్యక్తం అవుతోంది. వర్ధన్నపేట మున్సిపల్ అధికారుల కనుసన్నల్లోనే డివైడర్ ధ్వంసం అయినట్లు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇది వర్ధన్నపేట అభివృద్ధికి విరుద్ధమని పేర్కొంటున్నారు. డివైడర్ ధ్వంసం పట్ల సమగ్రమైన విచారణ చేపట్టాలని, మున్సిపల్ అధికారులపై ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఐక్యంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది.