
బొజ్జ బిక్షమయ్య సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకులు
Telangana state తెలంగాణ రాష్ట్రంలోని 31 మంది మాల మేధావులు తేదీ 17-12-2024న ఆంధ్రజ్యోతి పత్రికలో రిజర్వేషన్లను శాస్త్రీయబద్ధంగా వర్గీకరించాలని ఒక ప్రకటన విడుదల చేశారు. చాలా సంతోషం. వర్గీకరణ కావాలని ఈ మేధావులంతా అభిప్రాయపడటం మంచి విషయం. దీనిని అందరూ ఆహ్వానించాల్సిందే.
ఈ మేధావులు తెలుగు రాష్ట్రాల్లో పేరు ఎన్నిక కలిగిన అంబేద్కర్ వాద ప్రముఖులు. అంతేకాదు వీరిలో కొందరు వామపక్ష అభ్యుదయ ప్రజాతంత్ర లౌకిక బహుజన భావజాలం కలిగిన మేధావులుగా పేరుపొందారు.
తాను ఒక కులానికి ప్రతి నిదినని ambedkar అంబేద్కర్ ఏనాడు ప్రకటించుకోలేదు. మొత్తం నిమ్న జాతుల,అస్పృశ్యుల ప్రతినిధిగా ప్రకటించుకొని లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాడు. కులాల పుట్టుకకు మూలమైన హిందూమతంలో తాను పుట్టినా హిందువుగా చావనని ప్రకటించి అమలు చేసాడు.నిమ్న జాతుల కోసం, అణగారిన ప్రజల కోసం, అట్టడుగు వర్గాల దళితుల కోసం తన జీవితాన్ని ధార పోశాడు. నేడు మనువాద మతోన్మాదులు కులాల కుంపట్లు రాజేస్తున్నారు. కుల నిర్మూలన కోసం జీవితాన్ని ధారపోసిన dr baba saheb ambedkar డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు ఎవరైనా, ముఖ్యంగా మాల మాదిగ మేధావులు దళితు లందరి ప్రతినిధులుగా ఉండాలి. బహుజన, వామపక్ష మేధావులు, ఉద్యమకారులెవరైనా, ఒక కులంలో పుట్టినప్పటికీ ఆ కులానికే ప్రతినిధులుగా కాకుండా నిమ్న జాతులు, అంటరాని దళితులందరికీ ప్రతినిధులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.
30 సంవత్సరాల వర్గీకరణ పోరాటానికి ఆగస్టు ఒకటి 2024న సుప్రీంకోర్టు తీర్పుతో ఒక పరిష్కారం దొరికింది. సుప్రీంకోర్టు తీర్పును అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని మాదిగ సోదరులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారు. తమ పోరాట ఫలితంగా ఎంతో కొంత తమకు మేలు జరుగుతుందని మాదిగలు ఆశిస్తున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వర్గీకరణ అమలు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ దశలో వర్గీకరణ తీర్పు రాజ్యాంగానికి, dr baba saheb ambedkar డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలకు వ్యతిరేకమనీ, దళితుల ఐక్యతకు విఘాతం కలిగిస్తుందనీ, అందుకని వర్గీకరణ నిలుపుదల చేయాలని మాల సోదరులు “సింహగర్జన” నిర్వహించారు. మాల మాదిగ ల లోని కొందరు నాయకుల రెచ్చగొట్టే ప్రకటనలు, చర్యల వల్ల మాల మాదిగల మధ్య ఘర్షణ తీవ్రమవుతుంది. శత్రు పూరిత వాతావరణం ఏర్పడింది. ఈ ఇలాంటి వాతావరణంలో మాల మాదిగల మధ్య సయోధ్య శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పి, ఐక్యం చేయాల్సి నటువంటి బాధ్యత ఇరు కులాల మేధావులపై ఉంది.
వర్గీకరణ వద్దనీ, జరగాలనీ గత 30 సంవత్సరాలలో అనేక చర్చలు, సిద్ధాంత రాద్ధాంతా లు అన్ని రకాల ఆందోళనలు పోరాటాలు జరిగాయి. ఇరు కులాల వారు పోరాడిఅలిసిపోయిన సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై చాలామంది మాల సోదరులు రివ్యూ పిటిషన్ వేశారు.తీర్పును వ్యతిరేకిస్తున్న వారు నేడు చేస్తున్న వాదన లన్నింటినీ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.కానీ రివ్యూ పిటిషన్లు అన్నింటిని సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రంలో పేరు కలిగిన 31 మంది మాల మేధావుల ప్రకటన చేయడం ఏలాంటి సంకేతాన్ని ఇస్తుంది. అది మాదిగలకు వ్యతిరేకమని భావించడానికి ఆస్కారం కలిగిస్తుంది. తీరా తిన బోయే ముందు కొంచెం ఆగండి అందరం కలిసి శాస్త్రీయంగా పంచుకొని తిందాం అంటే అర్థం ఏమిటి? ఆ శాస్త్రీయంగా ఎవరు పంచాలి, ఎప్పుడు పంచాలి, దానికి ఎంత కాలం కావాలి అని ఎవరైనా చెప్ప గలుగుతారా? ఇలా చెప్పటం అంటే రిజర్వేషన్ల ను బలపరుస్తున్నట్టే కనిపిస్తూ వ్యతిరేకించటమే అని ఎవరైనా ముఖ్యంగా మాదిగలు అపార్థం చేసుకుంటారు. అది మాల మేధావులకు మంచిది కాదు.
మాల మేధావులు వర్గీకరణకు అనుకూలమే కానీ….
ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు తాము అనుకూలమే అని రాశారు. కానీ అదే సమయంలో సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పు ఆర్టికల్ 341 కి వ్యతిరేకమని కూడా చెప్పారు. అంతేకాకుండా ఉప కులాల వర్గీకరణ శాస్త్రీయంగా జరగాలన్నారు. ఆ శాస్త్రీయత ఏమిటో , బి లో మాలలు వారి ఉప కులాలు ఉండాలని చెప్పిన వీరు ఏ.సీ.డీ లలో ఎవరు ఉండాలో చెప్పలేదు.
ఆర్టికల్ 341 ఏం చెప్పింది..?
1950 ఆర్టికల్ 341 ఈ క్రింది విధంగా చెప్పింది.
“రాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్ లేదా రాజ ప్రముఖతో సంప్రదించిన తర్వాత పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా ఈ రాజ్యాంగం యొక్క ప్రయోజనాల కోసం పరిగణించబడే కులాలు జాతులు లేదా తెగలలోని కులాలు జాతులు లేదా తెగలు లేదా సమూహాలను పేర్కొనవచ్చు ఆ రాష్ట్రానికి సంబంధించిన షెడ్యూల్డ్ కులాలుగా ఉండాలి”
అనగా 1950 ఆర్టికల్ 341 ప్రకారం ఒక కులాన్ని తీసివేయడం కానీ మరో కొత్త కులాన్ని చేర్చడం గానీ లేదు. ఈ ఆర్టికల్ లో ఉన్న కులాల్లోని వారికి రాజ్యాంగ ప్రయోజనాలు అనగా రిజర్వేషన్లు సమానంగా అనుభవించే హక్కు అందరికీ ఉండాలి.అదే సామాజిక న్యాయం, సమన్యాయం. ఆర్టికల్ 14 ఆర్టికల్ 15 క్లాస్ 4 ప్రకారం కూడా ఉప కులాల వర్గీకరణ అమలు చేయడం రాజ్యాంగానికి లోబడి ఉందనే విషయం స్పష్టమవుతుంది.
మాల మేధావుల ప్రకటనలోని మూడు ప్రధాన అంశాలు
మొదటి పాయింట్ లోనే ఎస్సీ వర్గీకరణ ఆర్టికల్ 341 కి వ్యతిరేకం అని ప్రకటనలో పేర్కొనడం ద్వారానే వర్గీకరణకు వీరు వ్యతిరేకం అని చెప్పకనే చెప్తున్నారు.వర్గీకరణ ఆర్టికల్ 341 విరుద్ధమా, అనుకూలమా అని ఎవరు తేల్చాలి. చట్టసభలు తేల్చాలి లేదా కోర్టులైనా తేల్చాలి. చట్టసభల్లో ఉండే పాలకవర్గాల ప్రతినిధులైన పార్లమెంట్ సభ్యులు ఈ సమస్యకు పరిష్కారం చూపించరు. వాళ్లకు ఎంత కాలం ఈ సమస్య ఉంటే అంతకాలం మంచిది. కనుక చాలా సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపించనట్టే ఈ సమస్య కూడా వారు పరిష్కారం చూపించరు.
ఎస్సీ వర్గీకరణ జరగాలనే 30 సంవత్సరాల పోరాటానికి ఆగస్టు ఒకటి 2024న ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఏదో విధంగా తీర్పునిచ్చింది. ఆయా రాష్ట్రాలు ఎస్సీ ఉప వర్గీకరణ చేసుకోవచ్చని భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ తీర్పు సరైనది కాదనీ, రాజ్యాంగ వ్యతిరేకమనీ,రాష్ట్రాలకు ఆ అధికారం లేదనీ ఎవరు భావించినా మళ్లీ కోర్టుకు వెళ్ళవచ్చును. అందులో తప్పులేదు. అంతేకాదు తాము న్యాయం అనుకున్నా సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఘర్షణలకు తావివ్వకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేయవచ్చును కానీ జరుగుతున్నది ఏమిటి మాల మాదిగల మధ్య పూడ్చలేని అగాదం ఏర్పడుతుంది. ఒకరిపై ఒకరు విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారు. పాటలు, మాటలు, సింహగర్జనలు వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. పాలక పార్టీల రెండు కులాల ప్రజా ప్రతినిధులు మాల మాదిగల మధ్య మంట పెట్టి వేడి పెంచుతున్నారు. దురదృష్ట వశాత్తు మేధావులైన వారు దళితులలో ఐక్యత పెంపొందించాల్సింది పోయి తమ తమ కులాలకు పరిమితమై ప్రకటనలిస్తున్నారు.
రెండవ పాయింట్ లో “వర్గీకరణ ఆర్టికల్ 341 కి వ్యతిరేకమయినప్పటికీ ఉప వర్గీకరణ చేసి ఎస్సీ కులాలలోని అర్హులైన సమూహాలకు సామాజిక న్యాయం చేకూర్చాలనే వాదనను సమర్థిస్తున్నాం”. అని ఈ మేధావులు పేర్కొన్నారు.సుప్రీంకోర్టు తీర్పు వీరు పేర్కొన్న దానికి ఏమైనా భిన్న మైనదా? కానప్పుడు ఆ తీర్పును బల పరచవచ్చు కదా.
మూడవ పాయింట్ : “ఎస్సీ కులాల జనాభాను నిష్పాక్షికంగా నిర్దిష్టంగా లెక్క కట్టాలన్నారు. ఈ పాయింట్ కింద పేర్కొన్న ఆరు అంశాల ప్రాతిపదికన ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేయాలని చెప్పారు”. ఇది మంచి విషయం.
అయితే ఈ మూడో పాయింట్ లోని నాలుగో అంశంలో మాల వారి ఉప కులాలను, మాదిగ దాసరులను బి గ్రూప్ లో చేర్చాలని పేర్కొన్నారు.ఏ నిష్పాక్షిక, నిర్దిష్ట లెక్కల ప్రకారం ఈ నిర్ధారణకు వచ్చారు. ఇదే విధంగా మిగతా 59 కులాలను కూడా ఏ సి డి ల కింద వర్గీకరించి ఉంటే సరిపోయేది కదా! మిగతా కులాలలో వర్గీకరణకు ఏ ప్రాతిపదికన తీసుకోవాలో చెప్పారు.మాల కులానికి కూడా ఇది వర్తిస్తుంది కదా. మీరు చెప్పిన ప్రాతిపదికనే నిష్పాక్షిక నిర్దిష్ట లెక్కల ధ్రువీకరణ అనంతరం 59 కులాలను వర్గీకరిస్తే సరిపోతుంది. అయితే ఆ నిస్పాక్షిక నిర్దిష్ట లెక్కలు తేల్చాలని ప్రభుత్వానికి ఒక నిర్దిష్ట సమయం నెల,రెండు నెలల సమయాన్ని పెట్టి ఉంటే బాగుండేది. అలా కాకుండా మీరు మాల కులాన్ని ముందుగా “బీ” లో పెట్టడం మిగతా వాటిని ఎందులో పెట్టకపోవడం నిజాయితీగా, నిష్పక్షపాతంగా
లేదు.
మేధావి వర్గానికి విజ్ఞప్తి
Dr baba saheb ambedkar డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులమైన మనం అడుగంటి పోతున్న రిజర్వేషన్ల కోసం పోరాటాలు చేసుకుని విడి పోవద్దు. పెరిగిపోతున్న ప్రైవేటీకరణ ఫలితంగా రిజర్వేషన్లు తరిగి పోతున్నాయి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు సాధించాల్సిన కర్తవ్యం మన ముందు ఉంది.ఆ మహనీయుని మాట బాట రాజ్యాధికారం. ఆ రాజ్యాధికారం మన చేతిలో ఉంటే రిజర్వేషన్లు కాదు, సకల సమస్యలను పరిష్కరించు కోవచ్చును. సమ సమాజాన్ని నిర్మించు కోవచ్చును.
ఆ రాజ్యాధికారాన్ని సాధించడానికి ముందుగా 59 దళిత కులాలన్నీ ఒకటిగా ఉండాలి. వారి మధ్య ఉండే, వారు ఎదుర్కొనే సమస్యలకు కారణం ప్రభుత్వ విధానాలు తప్ప తోటి దళితుడు, దళిత కులం కాదనే విషయాన్ని గుర్తించాలి.ఎస్ టి, బీ.సీ సోదరులతో మమేకమై బహుజనులంతా ఒక్కటే అనే బహుజన కాన్సెప్ట్ పెంపొందించాలి. వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులతో జత కట్టాలి. అంతిమంగా కుల మత దోపిడి రహిత శ్రమజీవుల రాజ్యాన్ని సాధించాలి. ఇందుకోసం మేధావులు నడుము కట్టాలి. అలా కాకుండా తమకు తాము ఒక కులానికి పరిమిత మవడం బాధాకరం. ఇప్పటికైనా దళితుల ఐక్యత కోసం కార్యాచరణ రూపొందించాలని సామాజిక న్యాయాన్ని కోరుకునే మేధావులు అందరికీ ముఖ్యంగా మాల మాదిగ మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నాను.
మిత్రులారా…..
నేను “మార్క్స్ అంబేడ్కర్ లు మన మార్గదర్శకులు” అని భావిస్తున్న వ్యక్తిని. వామపక్షాల ఐక్యత/ విలీనం తక్షణ అవసరంగా భావిస్తున్నాను.లాల్ నీల్ మైత్రి నేటి చారిత్రక అవసరంగా భావిస్తున్నాను. మనువాద మతోన్మాద భావజాల వ్యతిరేక పోరాటం మనందరి కీలక కర్తవ్యంగా ఉండాలని భావిస్తున్నాను.