
విసికె, ప్రజాసంఘాల డిమాండ్
కొడంగల్ నియోజకవర్గం లగచర్ల రైతులను బేషరతుగా విడుదల చేయాలని విసికె రాష్ట్ర అధ్యక్షులు డాజిలుకర శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఫార్మా కంపెనీల కోసం పచ్చటి పొలాలను నాశనం చేయడానికి ఒప్పుకోమని హఖీంపేట పోలేపల్లి, లగచర్ల రైతులు గత ఆర్నెళ్లుగా పోరాడుతున్నా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం వల్లనే జిల్లా కలెక్టర్, ఇతర అధికార యంత్రాంగం మీద ప్రజలు కన్నెర్ర చేశారని ఆయన అన్నాడు. రైతుల పోరాటాన్ని అణచివేయడానికి బిఆర్ఎస్ నాయకుల మీదికి చర్చను మల్లిస్తుందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటే, రేవంత్ రెడ్డి అందుకు విరుద్ధంగా పని చేస్తున్నాడని అన్నారు. దళిత, గిరిజనులు, బిసిల భూములు లాక్కోవడం సామాజిక న్యాయమా అని ఆయన ప్రశ్నించాడు. గద్దర్ విగ్రహ కమిటీ అధ్యక్షులు కోండ్ర నర్సింగరావు మాట్లాడుతూ పటాన్చెరు, మేడ్చల్, కుత్బుల్లాపూర్ లాంటి చోట ఇప్పటికే ఫార్మా కంపెనీల వల్ల కాలుష్యం పెరిగి ప్రజల ప్రాణాలు పోతున్నాయని, ఇప్పుడు లగచర్లలో ఫార్మా కంపెనీలు పెట్టి ఎంతమందిని చంపుతారని ప్రశ్నించాడు. ఫారా కంపెనీల ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని భారత్ బచావో నాయకులు వెంగళ్ రెడ్టి డిమాండ్ చేశారు. రైతులది ధర్మాగ్రహమని ఆయన అన్నారు. లగచర్ల రైతుల పోరాటం మహత్తరమైనదని డిబిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చుంచు రాజేందర్ అన్నారు. తెలంగాణ రైతాంగం లగచర్ల పోరాటంతో స్ఫూర్తి పొందింది అని ఆయన అన్నారు. మాజీ కార్పోరేటర్ జోరిక రమేష్ మాట్లాడుతూ రైతుల అరెస్టును ఖండించారు. అభివృద్ధి పేరుతో రైతులను భూమికి దూరం చేయొద్దని ఆయన హితువు పలికారు. ఈ కార్యక్రమంలో విసికె వర్కింగ్ ప్రెసిడెంట్ మచ్చ దేవేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెరిపల్లి ఆనంద్, వరంగల్ జిల్లా అధ్యక్షులు కన్నాల రవి, గద్దర్ విగ్రహ కమిటీ నాయకులు ఎబ్నైజర్ తదితరులు పాల్గొన్నారు.