- బీఆర్ఎస్ పత్తిపాక గ్రామ ప్రధాన కార్యదర్శి తుడుం వెంకటేష్
Preparations for setting up a new stone crusher should be abandoned : హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామ శివారులో కొత్తగా స్టోన్ క్రషర్ ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని గ్రామ ప్రధాన కార్యదర్శి తుడుం వెంకటేష్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. గ్రామ పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సాగించే ఈ వినాశకర చర్యలను తక్షణమే ఆపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే గ్రామ శివారులో నిర్వహించ బడుతున్న స్టోన్ క్రషర్, డాంబర్ ప్లాంట్ వల్ల పత్తిపాక ప్రజలకు నష్టం ఏర్పడింది. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ తవ్వకాల వల్ల ఒక గుట్ట కనుమరుగై ఆనవాళ్ళులేకుండా పోయిందని గుర్తు చేశారు. విచ్చలవిడి బోర్ బ్లాస్టింగ్స్ వల్ల గ్రామంలోని నివాస గృహాలు భూకంపం వచ్చినట్లు కంపించిపోతున్నాయన్నారు. ఇళ్ల గోడలకు పెద్ద ఎత్తున పగుళ్లు ఏర్పడి కూలిపోయే స్థితికి చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Preparations for setting up a new stone crusher should be abandoned
అనుమతులకు మించి నిబంధనలకు విరుద్ధంగా గుట్టను అడ్డగోలుగా తవ్వేసి పాతాళాన్ని తలపించేలా లోతుగా తోడేశారు. సంబంధిత అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ఇప్పుడు మరో క్రషర్ ఏర్పడితో మరోగుట్ట కనుమరుగవటం ఖయమని ఆందోళన చెందారు. ప్రస్తుతం ఉన్న క్రషర్ లో బ్లాస్టింగ్ సమయంలో రాళ్లు ఎగిరి నేరుగా పంట పొలాల్లో పడుతున్నాయని, క్రషర్ నుంచి వచ్చే దుమ్ము, ధూళి వల్ల పంటలు పండక రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారని పేర్కొన్నారు. విపరీతమైన శబ్ద కాలుష్యం, గాలిలో నిండిన ధూళి వల్ల గ్రామస్తులకు ఆరోగ్య సమస్యలు తప్పవని అన్నారు.
Preparations for setting up a new stone crusher should be abandoned
అయితే “కొత్త క్రషర్ ఏర్పాటును గ్రామ పంచాయతీ పాలకవర్గంలో ఉప సర్పంచ్, 11 మంది వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలందరూ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తుండాన్ని బీఆర్ఎస్ అభినందిస్తోందని అన్నారు. ఈ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఇదే ఐక్యతతో ముందుకుసాగాలని కోరారు. ఎవరైనా నాయకులు లేదా తాజా, మాజీ ప్రజాప్రతినిధులు కొత్త క్రషర్కు సహకరించాలనే ఆలోచనలుంటే పునరాలోచించి మానుకోవాలని వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. ప్రకృతి సంపదైన గుట్టలను రక్షించుకోవడానికి, గ్రామ ఉనికిని కాపాడుకోవడానికి పత్తిపాక ప్రజలంతా ఇదే ఐక్యతతో పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కొత్త క్రషర్ ఏర్పాటును అట్టుకోవడానికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో న్యాయబద్ధమైన పోరాటం, ప్రత్యక్ష ఆందోళన చేయడానికి ముందువరుసలో ఉంటుందని వెంకటేష్ స్పష్టం చేశారు.
