- తహసీల్దార్ గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల వినతి
- ఒక గుట్టను మింగేశారు.. మరో గుట్టపై కన్నేస్తారా..?
- ఉప సర్పంచ్, 11 మంది వార్డు సభ్యుల ఆధ్వర్యంలో అధికారులకు ఫిర్యాదు
No ‘new’ crusher in Pattipaka హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామ శివారులో ప్రకృతి సిద్ధమైన గుట్టలను అక్రమంగా తవ్వేస్తూ, కొత్తగా మరో స్టోన్ క్రషర్ ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న సన్నాహాలపై గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఈ మేరకు శుక్రవారం పత్తిపాక ఉప సర్పంచ్ తుడుం రాజు, వార్డు మెంబర్లు నాలికె వీర ప్రతాప్, పోతుగంటి ప్రమీల సారయ్య, గజ్జి రాజు, అంకేశ్వరపు సాయి లక్ష్మి, కొడిమాల మహేందర్, గజ్జి రమేష్, గడ్డమీది హారతి కర్ణాకర్, చిట్టి రెడ్డి పద్మ జంగారెడ్డి, ఐరబోయిన స్వప్న రాజు, కందగట్ల ప్రవీణ్ కుమార్, తుడుం స్రవంతి రాజు లిఖితపూర్వకంగా సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కు అందించారు. వినతిపత్రం సమర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ.. ఇప్పటికే గ్రామంలో ఉన్న పాత క్రషర్ వల్ల ఒక పెద్ద గుట్ట పూర్తిగా కనుమరుగైందని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా గుట్ట అడుగు భాగం వరకు పాతాళాన్ని తలపించేలా తవ్వేశారని, ఇప్పుడు మరో కొత్త గుట్టపై క్రషర్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ అక్రమ ప్రక్రియను వెంటనే విరమించుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు.
No ‘new’ crusher in Pattipaka
కొత్త క్రషర్ ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని, గ్రామ పంచాయతీ పాలకవర్గం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. పాత క్రషర్, డాంబర్ ప్లాంట్ వల్ల ఇళ్లు పగుళ్లు పడుతున్నాయని, విచ్చలవిడి బ్లాస్టింగ్స్ వల్ల జనం భయం గుప్పిట్లో బతుకుతున్నారని వివరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పాత క్రషర్‌ను తక్షణమే నిలిపివేయాలని, కొత్త క్రషర్ ఏర్పాటు ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పత్తిపాక గ్రామ శివారులో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గ్రామ ప్రయోజనాలను పక్కనబెట్టి క్రషర్లకు సహకరించాలని చూసే ఏ నాయకుడైనా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రకృతిని కాపాడుకోవడానికి, రైతుల పొలాలను రక్షించుకోవడానికి ప్రజలంతా ఐక్యతతో పోరాడాలని పిలుపునిచ్చారు.
