- తెలంగాణ జాగృతి పేరుతో సాగుతున్న రాజకీయ ప్రయాణంపై ప్రజలు, ఉద్యమకారుల ప్రజాస్వామిక “విమర్శ”
Is the Kavitha Party another political conspiracy : తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఒక నాయకుడి ఆలోచన కాదు, ఒక పార్టీ వ్యూహం అసలే కాదు. తెలంగాణ రాష్ట్ర లక్షల మంది ప్రజల సామూహిక చైతన్యం, వేలాది యువత త్యాగాల ఫలితం, తరతరాల ఆత్మగౌరవ ఆకాంక్షల ప్రతిబింబమే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. తెలంగాణ ఉద్యమాన్ని గురించి మాట్లాడే ప్రతి రాజకీయ నాయకులు ప్రజల పరిశీలనకు, ఉద్యమకారుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందే ! ప్రస్తుత నేపథ్యంలొనే ఈ మధ్యకాలంలో “తెలంగాణ జాగృతి” పేరుతో జరుగుతున్న రాజకీయ చలనం మీద తీవ్రమైన చర్చ మొదలైంది. ఆ చర్చల మధ్యలో నిలుస్తున్న పేరు aaకల్వకుంట్ల కవిత.
Is the Kavitha Party another political conspiracy..!?
మద్యం పాలసీ కేసులో (డిల్హి లిక్కర్ స్కామ్) సెంట్రల్ ఏజెన్సీలు ఆమెను అరెస్ట్ చేసి 2024 మార్చిలో ఢిల్లీలోని తిహార్ జైలుకు పంపాయి. తర్వాత సుమారు 5 మాసాల తర్వాత 2024 ఆగస్టులో సుప్రీంకోర్ట్ నుండి బెయిల్ ద్వారా విడుదలయ్యారు. విడుదలైన తర్వాత ఆమె వివిధ రాజకీయ, సమాజ సేవ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ లోకంలో విభిన్న అభిప్రాయాలు ప్రకటించింది, తను బీఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ రాజకీయస్థానాన్ని పునర్నిర్మించడానికి ప్రస్థానం మొదలు పెట్టింది.
కవిత జైలు నుంచి విడుదలైన తరువాత ప్రజల ముందుకు రావడం అసహజం కాదు. ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తి తిరిగి రాజకీయంగా చురుగ్గా మారడం సహజ ప్రక్రియే. కానీ ప్రజాస్వామ్యంలో ‘రావడం’ కంటే ముందు ‘ఎలా రావడం’ అనేది కీలకం. ఆమె జైలుకు వెళ్లడానికి కారణమైన మద్యం పాలసీ కేసు వ్యక్తిగత అపవాదు కాదు; అది ప్రజా జీవితానికి సంబంధించిన తీవ్రమైన అంశం. అటువంటి ఆరోపణల నుంచి బయటకు వచ్చిన తరువాత, ఆ అంశాలపై పూర్తి పారదర్శకత చూపకుండా, నైతిక బాధ్యతపై చర్చకు రాకుండా, నేరుగా ఉద్యమకారుల భావోద్వేగాలను తాకే వేదికను ఎంచుకోవడం అనేక సందేహాలకు దారితీస్తోంది. ఇది నిజంగా తెలంగాణ ఉద్యమం పట్ల ఉన్న బాధ్యతా, లేక రాజకీయంగా తిరిగి స్థిరపడేందుకు ఎంచుకున్న సురక్షిత మార్గమా అనే ప్రశ్న ఉద్యమకారుల మనసుల్లో బలంగా వినిపిస్తోంది.
“తెలంగాణ జాగృతి” అనే వేదికను సామాజిక ఉద్యమంగా ప్రజల ముందు ఉంచుతున్నప్పటికీ, దాని పనితీరు, నిర్మాణం, నిర్ణయాలు పూర్తిగా వ్యక్తి కేంద్రికృతంగా కనిపిస్తున్నాయి. ఉద్యమాలు వ్యక్తి ఆధారంగా కాకుండా కమిటీ నిర్మాణాల తీర్మానాలకు లోబడి నడుస్తాయి. అవి పారదర్శకంగా ఉంటాయి, ప్రజలకు జవాబుదారీగా ఉంటాయి. కానీ ఇక్కడ కనిపిస్తున్నది ఒక రాజకీయ నాయకురాలి చుట్టూ తిరిగే కార్యాచరణ. అందుకే ఇది ఉద్యమ సంస్థగా కాకుండా ఒక రాజకీయ వాహనంలా మారుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. జైలు నుంచి విడుదలైన కొద్ది రోజుల్లోనే సభలు, సమావేశాలు, కార్యచరణ ప్రకటనలు మొదలవడం ఈ అనుమానాలను మరింత పెంచింది. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం సుమారు 2 సంవత్సరాలు 10 నెలలు అంటే దాదాపు 1,040–1,060 రోజులు ఉన్నాయి. ఇప్పుడే ఇంత తొందర ఎందుకు? ఉద్యమాలు ప్రజల బాధ నుంచి పుడతాయి కానీ ప్రచార రాజకీయాలు అవకాశాన్ని చూసుకుని మొదలవుతాయి. ఈ రెండింటి మధ్య తేడాను తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఉద్యమకారులు బాగా గుర్తిస్తున్నారు. ఈ తొందర అంతా ఉద్యమ అవసరాల కోసం కాకుండా రాజకీయ హడావుడి కోసం అనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కలవడం, ఉద్యమంలో చనిపోయిన వారి త్యాగాలను గుర్తు చేసుకోవడం ప్రతి ప్రజాప్రతినిధి మౌలిక బాధ్యత. కానీ అదే చర్యలు కెమెరాల మధ్య, రాజకీయ సందేశాలతో, భవిష్యత్ కార్యాచరణల ప్రకటనలతో కలిసివస్తే, ఆ గౌరవం ప్రచారంగా మారే ప్రమాదం ఉంది. అమరవీరుల కుటుంబాలు ఎవరి రాజకీయ పునఃప్రారంభానికి వేదికలు కావు. ఉద్యమకారులు పడిన భాద, వారు చేసిన త్యాగం నిజంగా గౌరవించబడుతోందా ? లేక రాజకీయ అవసరాలకు వినియోగించబడుతోందా ? అనే సందేహం ప్రతి ఉద్యమ కారుడి మనసులో ప్రశ్న. మారోజు వీరన్న వంటి ఉద్యమ స్థూపం వద్ద జరిగిన కార్యక్రమాలు కూడా ఇదే భావనను బలపరుస్తున్నాయి. ఆ స్థలాలు స్మరణకు, ఆత్మపరిశీలనకు, ఉద్యమ విలువలను తరతరాలకు చెప్పడానికి ఉన్నాయి కానీ అక్కడ రాజకీయ సందేశాలు, నాయకత్వ సంకేతాలు, భవిష్యత్ ప్రణాళికలు ఎక్కువైనప్పుడు, స్మారకాలు స్టేజీలుగా మారుతున్నాయన్న భావన కలుగుతోంది. ఇది ఉద్యమ కార్యాచరణ కోసం కాకుండా వ్యక్తిగత లేదా రాజకీయ ప్రయోజనాల కోసమే అన్న సందేహం కలగక మానదు. ఇటువంటి సందేహాలకు ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం లేదు.ఇటీవలి మున్సిపల్ ఎన్నికల వ్యవహారం ఈ మొత్తం రాజకీయ ప్రయాణాన్ని మరింత స్పష్టంగా చూపించింది. అధికారికంగా పార్టీ గుర్తు లేకపోయినా, ఇతర పార్టీల అభ్యర్థులను నిలబెట్టి, గెలిస్తే “మా ప్రభావం”గా చెప్పుకోవడం ఒక సామాజిక ఉద్యమ లక్షణం కాదు. ఇది స్పష్టమైన రాజకీయ ప్రయోగం. ఉద్యమాలు ఎన్నికల ప్రయోగశాలలుగా మారితే, వాటి విశ్వసనీయత దెబ్బతింటుంది. ప్రజాస్వామ్యంలో ఇది చట్టబద్ధంగా ఉండవచ్చు, కానీ నైతికంగా ఎంత వరకు సమంజసం. ఉద్యమకారుల సంక్షేమం గురించి మాట్లాడేటప్పుడు నినాదాలు, భావోద్వేగ ప్రసంగాలు ఉద్యమానికి ప్రేరణ ఇవ్వవచ్చు, కానీ సంక్షేమం కోసం కావాల్సింది స్పష్టమైన విధానాలు, చట్టపరమైన హామీలు, ప్రణాళికలు. ఇవేవీ స్పష్టంగా ప్రజల ముందుకు రాకుండా, “నేనే పోరాడుతున్నా” అనే మాటలు మాత్రమే వినిపిస్తే, ప్రజలు నమ్మడానికి వెనుకాడతారు ముఖ్యంగా తెలంగాణ సమాజం అందుకు సిద్ధంగా లేదు. పోరాటం అనేది భావోద్వేగం కాదు అది క్రమబద్ధమైన రాజకీయ–సామాజిక కార్యాచరణ.
Is the Kavitha Party another political conspiracy..!?
ఇంకొక ముఖ్యమైన కోణం – బాధితురాలిగా చూపించుకునే రాజకీయ ప్రయత్నం
జైలు అనుభవాన్ని, కేంద్ర సంస్థల చర్యలను చూపిస్తూ ఒక (విక్టిమ్ నేరేటివ్) తమను తాము బాధితులుగా గుర్తించాలని, ఇందులో తమ తప్పు లేకపోయినప్పటికీ బలవంతంగా తమను ఇందులో ఇరికించారని ప్రజలను కోరడం రాజకీయంగా లాభదాయకం కావచ్చు, కానీ ఆ కథనాన్ని తెలంగాణ ఉద్యమ చరిత్రతో కలిపి చూపించడం ప్రమాదకరం. ఉద్యమకారుల త్యాగాన్ని వ్యక్తిగత రాజకీయ బాధతో కలపడం చరిత్రను మసకబార్చడమే అవుతుంది. ఈ సందర్భంలోనే ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ అవినీతి మీద మాట్లాడటం అవసరమే. కానీ ఇన్నాళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు మాత్రమే ఈ అంశాలు గుర్తుకు రావడం సహజంగానే అనుమానాలకు దారితీస్తోంది. సత్యం ఎప్పుడైనా సత్యమే, కానీ అది రాజకీయ అవసరాలకు అనుగుణంగా బయటకు వస్తే ప్రజలు ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఉద్యమాన్ని గౌరవిస్తూనే, దాన్ని రాజకీయ ప్రచార సాధనంగా మార్చే ప్రయత్నాలను తిప్పికొట్టాలి. తెలంగాణ ఉద్యమకారులు అమాయకులు కాదు. ప్రజలు మౌనంగా లేరు. మూడు సంవత్సరాల ముందే ఉద్యమ భావోద్వేగాలతో రాజకీయ బాట వేయడం చూస్తే, ఇది నిజంగా ప్రజల అవసరాల కోసమా, లేక రాజకీయ లాభాల కోసమా అనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. 2019లో కవిత తన ఆస్తులను ₹7.63 కోట్లు అని ప్రకటించి, తిరిగి 2021 Member of Legislative Council ఆఫిడవిట్లో ఆస్తులను ₹20.48 కోట్లు అంటూ డిక్లేర్ చేసిన విషయం స్పష్టంగా ఉంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకపోయినా అధికారికంగా సమర్పించిన ఆస్తి వివరాలు. ఇవన్నీ కూడా ఆమె వ్యక్తిగత ఆస్తులు.
తెలంగాణ ఉద్యమంలో త్యాగం అంటే ఆత్మబలిదానాలు మాత్రమే కాదు. వేలాది మంది యువకులు తమ ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో లక్షలాది మంది ఉద్యమకారులు పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు, తూటాలకు ఎదురు నిలిచారు, అక్రమ కేసులు భరించారు, ఉద్యోగాలు కోల్పోయారు, చదువులు ఆగిపోయాయి, కొందరు జైళ్లలో సంవత్సరాలు గడిపారు. ఇవన్నీ బహిరంగంగా కనిపించే త్యాగాలు. కానీ వీటి వెనుక మరో మౌనమైన, అత్యంత కీలకమైన త్యాగం ఉంది — ఆస్తుల త్యాగం.
1969 ఉద్యమం నుంచే తెలంగాణ ఉద్యమం ప్రజల జేబుల మీద నడిచింది. రైతులు తమ పొలాలను అమ్మి ఉద్యమానికి డబ్బులు సమకూర్చారు. చిన్న వ్యాపారులు దుకాణాలు తాకట్టు పెట్టి సభలకు, ప్రచారాలకు ఖర్చు పెట్టారు. కుటుంబాలు బంగారం అమ్మి ఉద్యమకారులకు భోజనం పెట్టాయి. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల చదువు కోసం దాచుకున్న డబ్బును ఉద్యమం కోసం త్యాగం చేశారు. ఇవన్నీ ఎక్కడా రికార్డుల్లో లేవు. కానీ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇవే బలమైన పునాదులు. మలిదశ 2009 ఉద్యమం వచ్చేసరికి ఉద్యమం మరింత విస్తృతమైంది. సభలు, ర్యాలీలు, రాస్తారోకోలు, బందులు ఇవన్నీ సహజంగా జరగలేదు. వాటి వెనుక గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రజలే ఖర్చు పెట్టారు. అనేక మంది ఉద్యమకారులు తమ వ్యక్తిగత భూములు అమ్ముకున్నారు. కొందరు అప్పులపాలయ్యారు. రాష్ట్రం వచ్చాక కూడా వారు ఆ అప్పుల నుంచి బయటపడలేకపోయారు. కానీ వారు ఎప్పుడూ “మా త్యాగానికి ప్రతిఫలం ఇవ్వండి” అని డిమాండ్ చేయలేదు. ఇన్ని త్యాగాలు వారు చేసింది వ్యక్తిగత లాభం కోసం పేరు కోసం కాదు స్వరాష్ట్ర సాధన అని, ఆత్మ గౌరవ నినాదం నిలబెట్టడం కోసం తమ ఆస్తులను, అన్నింటిని త్యాగం చేశారు. చరిత్రలో ఇంతటి త్యాగం చేసిన వారి పేరు కూడా ఉండకపోవడం వారి త్యాగనిరతికి నిదర్శనం. తెలంగాణ ఉద్యమం చెక్కులతో నడవలేదు.ఇది విరాళాల రసీదులతో సాగలేదు.తమ ఇళ్లను అమ్మి, భూములను తాకట్టు పెట్టి ఉద్యమం నడిపారు.1969 ఉద్యమ సమయంలో వరంగల్, కరీంనగర్, నల్గొండ, మెదక్ ప్రాంతాల్లో చిన్న రైతులు తమ భూముల పట్టాలు అమ్మి పోస్టర్లు, ప్రచారం, ప్రయాణ ఖర్చులు భరించారు. అనేక కుటుంబాలు “ఉద్యమం పూర్తయ్యాక మళ్లీ కొనుక్కుందాం” అనే ఆశతో భూములను త్యాగం చేశారు. కానీ ఏ ఒక్కరు కూడా తిరిగి పొందలేక పోయారు. తెలంగాణ ఉద్యమంలో కాళోజి నారాయణరావు గారు ప్రభుత్వ ఉద్యోగం, పెన్షన్, సాహిత్య పుస్తకాలు ద్వారా వచ్చే ఆదాయం ఇవన్నీ తెలంగాణ ఆత్మగౌరవానికి అంకితం చేశారు.
ఆయన వద్ద భూములు లేవు, కానీ ఆయన జీవితం మొత్తం ఉద్యమానికి ఇచ్చారు. ఇది ఆస్తి కంటే గొప్ప త్యాగం. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన అకడమిక్ కెరీర్, విదేశీ అవకాశాలు, ఉన్నత పదవులు ఇవన్నీ వదిలి “నీళ్లు, నిధులు, నియామకాలు” అనే సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కాలక్రమేణా ఉద్యమం మళ్లీ ఉప్పొంగింది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు శ్రీకాంత చారి ప్రాణత్యాగంతో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సబ్బండ వర్గాల చేతుల్లోకి వెళ్లడమే కాకుండా 2009 మలిదశ ఉద్యమం లక్షల మందిని రోడ్లపైకి తీసుకొచ్చింది. స్వరాష్ట్ర సాధన సాకారం అయ్యింది.
Is the Kavitha Party another political conspiracy..!?
తెలంగాణ ఉద్యమం ప్రజలది. దాన్ని నిజంగా గౌరవించాలంటే, తెలంగాణ చరిత్రను రాజకీయ కవచంగా కాకుండా ప్రజాస్వామిక బాధ్యతగా తీసుకోవాలి. లేకపోతే, ఉద్యమకారుల ప్రశ్నలే ఆ రాజకీయ ప్రయత్నాలకు సమాధానం చెబుతాయి. కోయిల ముందే కూసిందా లేదా అన్నది కాలమే తేల్చుతుంది. కోయిల ముందే కూసినంత మాత్రాన పంట ముందే పండదు. తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ నినాదాలుగా మార్చే ప్రయత్నాలకన్నా, ఉద్యమానికి నిజమైన గౌరవం ఇచ్చే రాజకీయ ప్రవర్తన అవసరం. లేనిపక్షంలో ప్రజలే తేల్చి చెబుతారు. ఇది ఉద్యమ పునరుజ్జీవమా, లేక ఎన్నికల ముందస్తు ప్రచారమా అని.కానీ గుర్తుంచుకోండి తెలంగాణ ప్రజలు మాత్రం చూస్తూనే ఉన్నారు. అంతిమ నిర్ణయం ప్రజలు తీసుకుంటారు.
చార్వాక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ
Cell : 9347284111
