
ఆర్ఆర్ యాక్ట్ ను అమలు చేయడంలో అలసత్వంలో ఆంతర్యమేమిటో…!
ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నా చోద్యం చూస్తున్న అధికారులు…!!
హనుమకొండ జిల్లా నడికూడ మండల పరిధిలోని నర్సక్కపల్లిలో పరిధిలోని “కార్తికేయ”రైస్ మిల్లు పై అధికారులందరూ చుట్టాలే అన్నట్లుగా తెలుస్తోంది. ఆర్ఆర్ యాక్ట్ అమలు చేయడంలో అధికారులు అలసత్వం వహించడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సివిల్ సప్లై డిఎం, జిల్లా అదనపు కలెక్టర్ సైతం చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన సదరు మిల్లర్ పై చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వెనుక వారి రహస్యపు ఒప్పందాల రహస్యం బహిర్గతం అవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
2020-21 రబీ సీజన్ కు సంబంధించిన పౌరసరఫరాల శాఖ హనుమకొండ జిల్లా నడికూడ మండలం నర్సక్కపల్లి లో ఉన్న రైస్ మిల్ కు ధాన్యం పంపగా సదరు మిల్లర్ 4 ఏండ్లు గడిచినా ప్రభుత్వానికి సిఎంఆర్ పెట్టకపోవడంతో పౌరసరఫరాల శాఖ “కార్తికేయ” మిల్లుపై రెవెన్యూ రికవరీ యాక్ట్ (ఆర్ఆర్ యాక్ట్)నమోదు చేసినట్లు తెలిసినప్పటికీ ఇప్పటివరకు సదరు మిల్లర్ ఆస్తులు వేలం వేయకుండా అధికారులు వేడుకచూస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయాన్ని “జన నిర్ణయం” వరుస కథనాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చర్చానీయాంశంగా మారిన కార్తికేయ రైస్ మిల్లు వ్యవహారంలో సంబంధింత అధికారులు చర్యలు చేపట్టకపోవడం ఆరోపణలకు తావిస్తోంది. చర్యలు చేపడుతామని సదరు మిల్లు వ్యవహారంలో సంబంధిత ఫైల్ ను పరిశీలించి తగు చర్యలు చేపడుతామని స్పష్టంగా చెప్పిన అదనపు కలెక్టర్, సివిల్ సప్లై డిఎం ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని పలువురు భావిస్తున్నారు. లేదంటే రాష్ట్రస్థాయి అధికారులు ఆర్ఆర్ యాక్ట్ అమలు విషయంలో జోక్యం చేసుకునేలా తమ కార్యాచరణ ఉంటుందని ప్రజాసంఘాలు స్పష్టం చేస్తున్నారు.