
Doctor Jilukara Srinivas
పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన రాబోవు 2026లో జరగాల్సి వున్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యాఖ్యలకు ప్రాధాన్యత వున్నది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధైర్యాన్ని అభినందించి తీరవలసిందే. గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఢిల్లీలో కూచొని ఒక జాతీయ టివీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దక్షిణాదిని ఢిల్లీ పాలకులు గుర్తించటం లేదనీ, దక్షిణాది ఒక ప్రత్యేక దేశమనే అర్థం స్ఫురించేలా మాట్లాడారు. అలాంటి వ్యాఖ్యలు ఎన్నికలలో ప్రతికూల ఫలితాలిస్తాయని తెలిసి కూడా ఆయన చేయడం సాహసోపేత చర్యగానే చూడాలి. ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్టానం ఏ మేరకు సమర్ధిస్తుందన్నది పక్కకు పెడితే, దక్షిణాది ప్రయోజనాల కోసం పోరాడటానికి రేవంత్ రెడ్డి రాజీ పడడని అర్థం అవుతుంది. అయితే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకత్వం ఢిల్లీ పాలకులతో పోరాడినంత సులువుగా, ఉత్సాహంగా ఉత్తరాది వ్యాపార వర్గంతో పోరాడగలరా అన్నది సందేహమే.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రజలను ఉత్తేజితులను చేసిన అంశాలు చాలా వున్నాయి. వాటిలో ముఖ్యమైనవి : నీళ్లు, నిధులు, నియామకాలు, స్వయంపాలన, తెలంగాణ సంస్క్రుతి పరిరక్షణ. ఈ అంశాలన్నీ కలిసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలనే ఆకాంక్షను, సెంటిమెంటును రగిలించాయి. తెలంగాణ సంస్క్రుతి అంటే బతుకమ్మ, బోనాలు, అమ్మ దేవతల పండుగలు, మాత్రుస్వామిక స్వభావం, ముఖ్యంగా దోపిడీదారులకు వ్యతిరేకంగా పోరాడే తత్వం అని ఉద్యమకాలంలో మేధావులు, నాయకులు నిర్వచించారు. తెలంగాణలోని భూములు, ప్రక్రుతి వనరులు, సంపద అంతా తెలంగాణ స్థానికులకే దక్కాలని, వాటి మీద ఆంధ్ర వలస పాలకుల పెత్తనం ఏమిటని ప్రజలు నిలదీశారు, నినదించారు. ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో జరగనంత పెద్దదీ సుధీర్ఘకాలం జరిగినదీ ఒక మన దేశంలోనే జరిగింది. అది తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఒక్కటే. ప్రజల బలమైన రాజీలేని పోరాటం వల్ల ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2014లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది. అదొక చారిత్రక సంఘటన.
2014లో రెండు చారిత్రక సంఘటనలు జరిగాయి. ఒకటి, తెలంగాణ ఆవిర్భావం, టిఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు. రెండు, బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత కొన్ని మౌలిక వసతుల నిర్మాణం చేయడంతో పాటు, వేగంగా అభివ్రుద్ధి చెందిన రాష్ట్రంగా గుర్తింపు పొందడానికి టిఆర్ఎస్ అనేక ప్రయత్నాలు చేసింది. పదేండ్ల కాలంలో ఆ ప్రభుత్వం తెలంగాణ స్వరూపాన్ని గణనీయంగా మార్చేసింది నిజం. అయితే, ఆ పార్టీ గుజరాతు, ఉత్తరాది వ్యాపార వర్గాలను ఆశ్రయించడం ద్వారా తెలంగాణను అభివ్రుద్ధి పథంలో నడపాలని అనుకోవడం వల్ల జరిగిన నష్టం ఎవరూ పూడ్చలేనిది. గత టిఆర్ఎస్ ప్రభుత్వం, నరేంద్ర మోదీ ఆర్థిక విధానాలను సంపూర్ణంగా సమర్ధిస్తూ, ఉత్తరాది వ్యాపార వర్గాల విస్తరణకు సంపూర్ణంగా సహకరించింది. ఫలితంగా 2014కు ముందు ప్రధాన పట్టణాలలో, జిల్లా కేంద్రాలలో పది, ఇరవై దుకాణాలున్న ఉత్తరాది వ్యాపారం 2024 నాటికి పూర్తిగా తెలంగాణను ఆక్రమించడానికి దారితీసింది.
తెలంగాణ జిల్లాలు 33 అయ్యాయి. కానీ ఏ ఒక్క జిల్లాలోనూ స్థానికుల ఆధీనంలో వ్యాపార రంగం లేదు. ఉత్తరాది వ్యాపార వర్గాలు పెద్ద యెత్తున తెలంగాణలోని ప్రతీ మండల కేంద్రాలకు, అలాగే 2000 జనాభా వున్న ప్రతీ గ్రామాలలోకి చొచ్చుకొని వచ్చాయి. నిత్యావసర సరుకులను అమ్మే దుకాణాల నుంచి మొదలుకొని బంగారం, వజ్రాల వ్యాపారం వరకు తెలంగాణ రాష్ట్రం ఉత్తరాది వ్యాపారుల నియంత్రణలోకి వెళ్లిపోయింది. సంప్రదాయ తెలంగాణ వ్యాపార వర్గం సైతం ఈ ఉత్తరాది వ్యాపార సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి నిలబడలేక పోయింది. చివరికి తూప్రాన్, నాగర్ కర్నూలు వంటి ప్రాంతాలలో స్థానికులు ఆందోళనలు చేసే దాకా పరిస్థితి దిగజారింది. తెలంగాణలోని ప్రజల కొనుగోలు శక్తి ద్వారా లభించే లాభాలన్నీ ఉత్తరాది వ్యాపారుల ఖజానాకే చేరుతున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒకే దేశం, ఒకే మార్కెట్, ఒకే పన్ను విధానం వల్ల ఉత్తరాది వ్యాపార సామ్రాజ్యవాదులు తెలంగాణలోకే కాదు, మొత్తం దక్షిణాది రాష్ట్రాలలోకి చొచ్చుకు రావడానికి, మార్కెటును నియంత్రించడానికి కారణమైంది.
అసలు తెలంగాణలో పండే పంటలు ఎక్కడికి పోతున్నాయి? తెలంగాణలోనే కాదు, మొత్తం దక్షిణాదిలోనూ, ఉత్తరాదిలోనూ పండే పంటలన్నీ గుజరాతుకే తరలిస్తున్నారు. పత్తి, వరి, గోదుమ, పప్పు దినుసులు ఒక్కటేమిటి? ప్రతీ ఉత్పత్తినీ గుజరాత్ పెట్టుబడిదారుల దగ్గరికే చేరవేస్తున్నారు. ఆదాని, అంబానీ లాంటి బడా వ్యాపారులు గుజరాతులో చాలామందే వున్నారు. వాళ్లంతా మనం పండించిన పంటను కొనుగోలు చేసి, మనకే అధిక ధరలకు అమ్ముతున్నారు. పండించిన పంటకు లాభాలు రావాలని రైతులు పోరాడుతున్నారు. అదే రైతులు పండించిన పంటను అమ్ముకున్న తర్వాత గుజరాతు వ్యాపారులు అమ్మే అవే ఉత్పత్తులకు వినియోగదారులవుతున్నారు. ఈ రెండు చర్యల వల్ల ఉత్తరాది వ్యాపారులకే లాభాలు సిద్ధిస్తున్నాయి. ఈ సత్యాన్ని దక్షిణాది ప్రజలు అర్థం చేసుకోవడం లేదు. వ్యవసాయ పంటల ఎగుమతులు పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. కానీ ఆ ఎగుమతుల వల్ల ఎవరికి లక్షల కోట్ల ఆదాయం వస్తుందనేది ప్రభుత్వం బహిర్గతం చేయడం లేదు. విత్తనాల మీద, పంటల వైవిధ్యం మీద, మన దేశ వ్యవసాయ రంగం మీద బిల్ క్లింటన్ ఎలా దాడి చేస్తున్నాడో ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ వేత్త వందన శివ వివరిస్తున్నారు. కానీ మొత్తం దేశంలోని రైతులను, ముఖ్యంగా దక్షణాదిని దోచుకుంటన్న ఉత్తరాది వ్యాపార వర్గాల స్వరూప స్వభావాలను వివరించే వారు కరువయ్యారు.
తెలంగాణ, ఇతర దక్షిణాది రాష్ట్రాలకు వాటిదే అయిన ప్రత్యేక సంస్క్రుతి వున్నది. 2014 నుంచి ఆ సంస్క్రుతి ప్రమాదంలో పడ్డది. ముఖ్యంగా తెలంగాణలోని మూలవాసి సంస్క్రుతి పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం పొంచివున్నది. తెలంగాణ కల్చరైన బతుకమ్మ ఇప్పుడు రెండు రోజుల పండుగలా మారిపోయింది. ప్రతీ వాడలోకి, ప్రతీ గల్లీలోకి ఉత్తరాది కల్చర్ చొచ్చుకొచ్చింది. తెలంగాణకు సంబంధం లేని దేవీదేవతలను ఉత్తరాది వ్యాపార వర్గమే తీసుకొచ్చింది. స్థానిక యువకులను అది ప్రోత్సహిస్తూ తెలంగాణ పెద్ద పండుగైన బతుకమ్మను ఆడబిడ్డలకు దూరం చేస్తున్నది. అంతేకాదు, తెలంగాణలో కులాల మధ్య, మతాల మధ్య రెచ్చగొట్టే వాదనలకు, అల్లర్లకు ఈ ఉత్తరాది వ్యాపార వర్గమే ఊతమిస్తున్నది. మత రాజ్యం తేవాలని తపించే స్థానికులు కొంతమంది ఈ ఉత్తరాది వ్యాపార వర్గాలకు రక్షా కవచంగా నిలబడతున్నారు. ఈ మత రాజకీయాలను ఆర్థికంగా ప్రోత్సహిస్తూ ఉత్తరాది వ్యాపార వర్గం తెలంగాణ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అయితే, పార్టీలకు అతీతంగా పెద్ద నాయకులంతా ఈ ఉత్తరాది వ్యాపార సామ్రాజ్యవాదులతో కలిసిపోయి, వాటాదారులుగా మారారని, అందుకే, తెలంగాణ పూర్తిగా ఉత్తరాది నియంత్రణలోకి పోయిందనే విమర్శలున్నాయి.
ఈ ఆర్థిక కోణంతో పాటు రాజకీయ కోణాన్ని కూడా పరిశీలించాల్సిన అవశ్యకత ఏర్పడింది. పార్లమెంటులో మొత్తం 543 నియోజక వర్గాలున్నాయి. వాటిలో కేవలం 180లోపు సీట్లు దక్షిణాదిలో వున్నాయి. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, గోవా, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ తో కలిపి 180 సీట్లు వున్నాయి. అంటే, దక్షిణాదితో నిమిత్తం లేకుండా ఉత్తరాది పాలకులు పార్లమెంటులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. అలాగే చట్టాలను చేయవచ్చు. ఇప్పుడు జనాభా ప్రకారం సీట్లను పెంచితే ఉతరాదిలో సీట్లు పెరుగుతాయి, దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయి. జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు మంచి ఫలితాలు సాధించాయి. కానీ, బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలలో జనాభా నియంత్రణ జరగలేదు. ఫలితంగా ఒక్క ఉత్తర ప్రదేశ్ జనాభాయే 25 కోట్లు దాటింది. ఈ సంఖ్య మొత్తం అమెరికా జన సంఖ్యకు ఎక్కువే. మతాలతో నిమిత్తం లేకుండా ఆ రాష్ట్రాలలో అన్ని కుటుంబాలు ఎక్కువ మంది పిల్లలను కంటూనే వున్నారు. కానీ, ఎక్కువ మంది పిల్లలను కనడం అనాగరికమనే ఒక స్ప్రుహకు దక్షిణాది జనం వచ్చారు. కానీ ఈ చైతన్యమే ఇప్పుడు శాపంగా మారింది. తక్కువ జన సంఖ్య వుండటం వల్ల రాజకీయంగా బాధితులుగా బానిసలుగా మారే పరిస్థితి ఏర్పడ్డది.ఇప్పటికిప్పుడు దక్షిణాది జనాభాను రెండు, మూడిందతు చేయలేము. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో పుట్టిన పిల్లలకు మూడు రెట్టు ఉత్తరాది రాష్ట్రాలలో పుట్టారు. అందువల్ల అక్కడ ఉపాధి సమస్య ఎక్కువ.
ఉత్తరాదిలోని భూస్వామ్య వ్యవస్థ పేదలను చదువుకు దూరం చేసింది. భూస్వామ్య స్వభావం గల పాలక వర్గాలు ఉత్తరాది పాలకులను దరిద్రంలో, అజ్నానంలో వుంచటం ద్వారా తమ పాలనను కొనసాగిస్తున్నారు. అక్కడ విసిగిపోయిన యువకులు దక్షిణాదికి ఉపాధిని వెతుక్కుంటూ వలస వస్తున్నారు. నైపుణ్యంగల కార్మికులు, నైపుణ్యం లేని కార్మికులంతా ఇప్పుడు తెలంగాణను ఆక్రమించారు. హోటల్ సేవా రంగం మొదలుకొని ఐటి వరకు ఇప్పుడు అంతా వాళ్లే విస్తరించారు. అతి తక్కువ వేతనానికి గొడ్డు చాకిరి చేసేందుకు కూడా ఆ యువకులు సిద్ధపడుతున్నారు. దక్షిణాదిలో దొరికే వేతనం ఉత్తరాదిలో లభించే వేతనం లేదా కూలీతో పోలిస్తే చాలా ఎక్కువ. అలాగే సామాజిక భద్రత, స్వేచ్చ, ఆధునిక సౌకర్యాలు దక్షిణాదిలో ఎక్కవు. అందువల్ల ఉత్తరాది నుంచి వలసలు ఎక్కువ అయ్యాయి. అయితే, వలస వచ్చిన కూలీలు, ఉద్యోగులు, కార్మికుల వల్ల తెలంగాణ సంస్క్రుతికి లేదా దక్షిణాది సంస్క్రుతికి ఎలాంటి ఉపద్రవం లేదు. కానీ ఉత్తరాది వ్యాపార వర్గం నుంచి మాత్రం ఆ ప్రమాదం ఎక్కువ వుంది.
ఉత్తరాదికి సమానంగా దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటు నియోజక వర్గాలను పెంచడానికి అవకాశం లేదు. 1971 జనాభా లెక్కలనే ప్రామాణికంగా తీసుకున్నా కూడా దక్షిణాదిలో సీట్ల సంఖ్య పెరగదు. అందువల్ల సరైన పరిష్కారం అన్వేషించాలి. శశిథరూర్, ప్రొ.ఘంటా చక్రపాణి లాంటి మేధావులు కొన్ని పరిష్కారాలు ప్రతిపాదించారు. అయితే, వాటితో పాటు ఇంకొన్ని పరిష్కారాలను కూడా వెతకాలి. అందులో పార్లమెంటు వికేంద్రీకరణ ఒకటి. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. దేశభక్తులుగా, దేశాన్ని ప్రేమించే పౌరులుగా దేశ సమైక్యతను కాపాడుకోవాలి. రాజ్యాంగమే మన పవిత్ర గ్రంథంగా అంగీకరించాలి. అయితే, పార్లమెంటు వికేంద్రీకరణ దేశ సమైక్యతకు విఘాతం కలిగించదు. దక్షిణాది రాష్ట్రాల కోసం ఒక పార్లమెంటును ఏర్పాటు చేయడమే వికేంద్రీకరణ. దక్షిణాది రాష్ట్రాలకు అవసరమైన చట్టాలను చేసే అధికారం ఈ పార్లమెంటుకు వుండాలి. రెండు ప్రభుత్వాలు వుండాలి. దక్షిణాదిలో ఎన్నికైన ఎంపీలతో ఒక క్యాబినెట్ ఏర్పాటు చేయాలి. కేంద్రంల ప్రధాని ఉత్తరాది నుంచి వుంటే, ఉపప్రధాని దక్షిణాది నుంచి వుండాలి. ఆ ఉపప్రధాని దక్షిణాది క్యాబినెట్ కు నాయకత్వం వహిస్తాడు. అలాగే, విదేశాంగ విధానం, సరిహద్దు భద్రత, కరెన్సీ, విదేశీయానం, మిలటరీ, టెలీ కమ్యూనికేషన్, రైల్యేలు వంటివి కేంద్ర పార్లమెంటు పరిధిలో వుంటాయి. విద్యా, వైద్యం, వ్యవసాయం, కల్చర్, లాంగ్వేజ్, పన్నులు వంటివి దక్షిణాది పార్లమెంటుకు వుండాలి. దక్షిణాది పార్లమెంటు చేసే చట్టాలన్నీ రాజ్యాంగానికి లోబడి వుంటాయి. అలాగే రెండు బడ్జెట్లు. దక్షిణాది నుంచి వసూలయ్యే పన్నులు, సెస్సులు, ఇతర మార్గాల ద్వారా లభించే ఆదాయం అంతా కూడా దక్షిణాదికే కేటాయించి, వ్యయం చేసే అధికారం ఈ పార్లమెంటుకు వుండాలి. అలాగే, రెండు సుప్రీం కోర్టులు వుండాలి. దక్షిణాది కేసులను ఇక్కడే విచారించాలి. సుప్రీంకోర్టులో న్యాయం పొందడానికి రెండు వేల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి రావడం అత్యంత విచారకరం. ఒకే మార్కెట్, ఒకే పన్ను విధానం పూర్తిగా రద్దు చేసి దక్షిణాది మార్కెటులోకి ఉత్తరాది చొరబాటును రద్దు చేయాలి. రెండు పన్నుల విధానం తీసుకు రావాలి.
ఇవన్నీ అసాధ్యమైన అంశాలుగా అనిపించడం తప్పేమీ కాదు. కానీ దక్షిణాది ప్రజల స్వయంప్రతిపత్తిని, రాజకీయ ప్రాతినిధ్యాన్ని, వనరులను, స్వేచ్ఛను కాపాడుకోవడానికి ఇంతకు మించి మరోమార్గం కనిపించటం లేదు. అలాగే, దక్షిణాదిని, స్వయంపాలన, సంస్క్రుతి రక్షణ అనేవి తెలంగాణ అమరుల ఆకాంక్షలు. వాటిని వాస్తవికంగా నిజం చేయాలంటే తెలంగాణ ప్రజలు మరో పోరాటానికి సిద్ధపడక తప్పదు.
– డాక్టర్ జిలుకర శ్రీనివాస్ (Doctor Jilukara Srinivas)