
- “తురుకకుంట”ను ఖతం చేసిన ఘనులు…
- ప్లాట్లు చేసి అడ్డగోలు అమ్మకాలు…!
- కొనుగోలుదారులకు బురిడీ..
- అమ్మకాలు సరే… అనుమతుల సంగతేమిటంటున్న పలువురు…
- కొనుగోలుదారులను దగా చేస్తున్న రియల్టర్, మధ్య దళారులు…
- వీసీకే పార్టీ ఫిర్యాదుతో బలపడుతున్న అనుమానాలు..!
Illegal venture in Punnelu : హనుమకొండ జిల్లాలో అక్రమ వెంచర్ దారులు రాజ్యమేలుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమ లేఅవుట్లతో చెలరేగిపోతున్నారు. ఇందుకు ఐనవోలు మండలం పున్నేల్ పరిధిలోని బాబాయికుంట (తురుక కుంట) ను సైతం తమ స్వంత ఆస్తిగా మలుచుకొని వెంచర్ గా మార్చడమే సాక్ష్యంగా నిలుస్తోంది.
Illegal venture in Punnelu
తమది అన్ని రకాలుగా అర్హత కలిగిన వెంచర్ అంటూ కొనుగోలుదారులకు “ధరణి”ని అంటగడుతూ దగా చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. వ్యవసాయ భూమిని కొనుగులు చేసి, ప్లాట్లుగా మార్చి, ఆ ప్రక్కనే ఉన్న ఎఫ్టిఎల్ పరిధిలోకి కూడా చొరబడి ప్లాట్లుగా మార్చడం బహిరంగ రహస్యంగా మారింది. ఈ మేరకు విముక్త చిరుతల కచ్చి (వీసీకే) పార్టీ ప్రతినిధులు ఈ మధ్యకాలంలో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి విచారణ చేయాలని కోరడం గమనార్హమే. వందల ఏండ్లుగా ప్రజలకు, వ్యవసాయానికి ఉపయోగపడుతున్న బాబాయికుంట (తురక కుంట)ను రియల్ ఎస్టేట్ వారు ఆక్రమించి ఫ్లాట్లు చేసి అమ్ముతున్నప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం అనుమానాలకు తావిస్తోందని వీసీకే పార్టీ ప్రతినిధులతో పాటు పలు ప్రజాసంఘాలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఈ కుంట యొక్క ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ను అధికారులు గతంలో నిర్ధారించినట్లు తెలుస్తోంది.
Illegal venture in Punnelu
చెరువులు, కుంటలు అక్రమ కబ్జాకు గురికాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ హనుమకొండ జిల్లా పరిధిలోని చెరువులు, కుంటలు, వాగులు, ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయని వాటిని కాపాడటంలో అధికారుల అలసత్వం బహిర్గతం అవుతూనే ఉందని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికైనా ఐనవోలు మండలం పున్నేల్ పరిధిలోని బాబాయికుంట (తురుక కుంట) ఎఫ్టిఎల్ పరిధిని నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ చేసిన వ్యవహారం పట్ల అధికారులు సమగ్రమైన విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు. అధికారులు తమ చిత్తశుద్ధిని చాటుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిందే..!