
- నేడు SFI విద్యార్ధి నాయకుల ఆత్మీయ సమ్మేళనం….
- ఉమ్మడి వరంగల్ జిల్లా “ఎస్ఎఫ్ఐ” ఉద్యమ విద్యార్థి నేతల అపూర్వ కలయిక
- కాళోజీ కళాక్షేత్రం వేదికగా ఉమ్మడి ఓరుగల్లు విద్యార్థి ఉద్యమ నేతల ఆత్మీయ సమ్మేళనం…
- 1970 – 2016 వరకు వివిధ స్థాయిల్లో పనిచేసిన ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్ధి నేతల హాజరు
దారా
స్పెషల్ కరస్పాండెంట్ / జన నిర్ణయం
A spiritual gathering of former SFI movement leaders : ఒకప్పుడు ఒకటిగా గర్జించిన గొంతులు. అద్యాయనం, పోరాటం నినాదంతో ముందుకు సాగిన దేహాలు. సోషలిజమే లక్ష్యం అంటూ గర్జించిన సమూహం. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ముందుకు సాగిన విద్యార్థులు. కాలక్రమేనా ఇప్పుడు విభిన్న అభిప్రాయాలు. వివిధ రాజకీయాలు. వివిధ రంగాల్లో ప్రయాణం. వృత్తులు వేరు. జీవన శైలీ వేరు. రాజకీయ ప్రయోజనాలు వేరు. ఒకప్పటి గర్జన వేరు. ఇప్పటి ఆలోచన వేరు. ఒకప్పటి నినాదం వేరు. ఇప్పటి ఆచరణ వేరు. అయినప్పటికీ విద్యార్థి దశలోని ప్రయాణాన్ని, జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ రాజకీయాలకు అతీతంగా, ఆచరణకు అతీతంగా గత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ కాసేపు కలుసుకోవడానికి, గత కాలపు జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడానికి, ఒకప్పుడు కలిసి కొంతకాలం ప్రయాణించిన ఉద్యమ సాహచర్యాన్ని ఆలింగనం చేసుకోవడానికి ఎస్ఎఫ్ఐ ఉమ్మడి వరంగల్ జిల్లా పూర్వ విద్యార్థి ఉద్యమ నేతలు నేడు ఒక్క దగ్గరకు చేరనున్నారు. ఇందుకు హనుమకొండ నగరంలోని కాళోజీ కళాక్షేత్రం వేదిక కానుంది.
A spiritual gathering of former SFI movement leaders
1970 నుంచి 20160వరకు జిల్లా స్థాయిలోనూ, వివిధ స్థాయిల్లో ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో పనిచేసిన విద్యార్థి ఉద్యమ నేతలతో ఆత్మీయ సమ్మేళనం జరుగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్లు నిర్వాహకులు తెలిపారు. వందలాదిగా ఒకప్పటి విద్యార్ది ఉద్యమ నేతలు రాజకీయాలకు అతీతంగా హాజరవుతున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్ధి నాయకుల ఆత్మీయ సమ్మేళనం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చానీయాంశంగా మారుతోంది. ఈ సమ్మేళనం ఉద్దేశ్యం, లక్ష్యం ఏమిటనే ప్రశ్నలు సైతం లేకపోలేదు. అయితే గత జ్ఞాపకాలు స్మరించుకోవడం, అప్పటి త్యాగాలను నెమరు వేసుకోవడం, ఎవరు ఏ అభిప్రాయాలతో ఉన్నప్పటికీ, ఏ రాజకీయ లైన్ లో ఉన్నప్పటికీ ఒకప్పటి విద్యార్ది ఉద్యమ జ్ఞాపకాలనం గుర్తు చేసుకొని ఆత్మీయంగా కలుసుకోవడమే ఈ పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం అంటున్నారు నిర్వాహకులు. విద్యార్థి ఉద్యమంలోని త్యాగాలను ఈ సందర్భంగానైనా ఈ ఆత్మీయ సమ్మేళనంతో చరిత్ర వక్రికరణకు గురికాకుండా స్మరించుకోవాలని పలువురు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్ధి నాయకుల ఆత్మీయ సమ్మేళనం ఫలితం సాధించాలని ఆశిద్దాం.