
Professor GN Saibaba
నిరాధారమైన ఆరోపణలతో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సెంట్రల్ జైలు ”అండా సెల్”లో 3,588(తొమ్మిదేండ్లు)రోజుల పాటు నిర్బంధంలో దుర్భర జీవితం అనుభవించి చివరికి నిర్దోషిగా ప్రకటించబడిన ప్రొఫెసర్ సాయిబాబా (Professor GN Saibaba) విడుదలైన ఏడు నెలల వ్యవధిలోనే మరణించాడు ఇది అత్యంత విషాదకరమైన ఘటన. ఇది నిస్సందేహంగా ఈ దేశంలో అమలు చేసిన క్రూరచట్టాల ఫలితమే ఆయన మరణం. తొంభై శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాపై రాజ్య వ్యవస్థ వ్యవహరించిన తీరు ”ఉపా” దుర్వినియోగ మవుతున్న తీరును మరోసారి రుజువు చేసింది. కన్నతల్లిని కడసారి కూడా చూడటానికి అనుమతించకుండా ఈ దేశ మానవత్వానికి మచ్చతెచ్చింది.
సహజ న్యాయసూత్రం ప్రకారం.. నేరగాళ్లను శిక్షించాలి, నిర్దోషులను రక్షించాలి. కానీ మనదేశంలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. మోడీ పాలనలో మాట్లాడినా, ప్రశ్నించినా, వ్యతిరేకించినా, ఆట,మాట, పాట, ఒక రకంగా స్వేచ్ఛ హక్కుల కోసం ఏమాత్రం పోరాడినా సామాన్యులైనా, మేధావులైనా ‘ఉపా’కి బలి కావాల్సిందే. ఇది ఈ దేశంలోని పౌర సమాజానికి పాలకులు ఇస్తున్న తిరోగమన భరోసా. వేల కోట్ల రూపాయలు దిగమింగేసిన ఇతర దేశాలకు చెక్కేసిన ప్రబుద్ధులకు ఎలాంటి శిక్షలూ లేవు. లైంగికదాడులు, పలు హత్య కేసుల్లో దోషిగా నిరూపించబడిన ‘డేరా బాబా’కు ఆయన అనుకున్నప్పుడు పద్నాలుగు సార్లు పెరోల్‌పై బయటికి వచ్చే అవకాశం కల్పించారు. కానీ నేరం రుజువు కాకుండానే నిరాధారమైన ఆరోపణలతో సాయిబాబాను హింసించింది ఈ రాజ్యం.
చీకటి గదిలో బంధించి ”చావు”కు సిద్ధం చేసింది దేశం.ఇది ముమ్మాటికీ సర్కారు చేసిన ‘హత్యే’!జార్ఖండ్‌లో హక్కులు, ఆదివాసులు, సహజ వనరుల పరిరక్షణ కోసం మాట్లాడిన 84ఏళ్ల కురువృద్ధుడైన ఫాదర్ స్టాన్ స్వామి ”ఉపా” కేసులో బంధించబడి విచారణ ఖైదీగా జైలులోనే ప్రాణాలు విడిచారు. ఇలా ఎంతోమంది దేశంలోని జైళ్లలో విచారణ ఖైదీలుగా శిక్షలు అనుభవిస్తున్నా రు. ఇప్పటివరకు అధికారిక సమాచారం ప్రకారం, 2014 -2022 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 8719 ”ఉపా” కేసులు నమోదయ్యాయంటే అతిశయోక్తి కాదు.
అయితే వాటిలో శిక్షలు పడినవి 222 మాత్రమే. ఆ ఎనిమిదేండ్లలో 14,809 మంది ”ఉపా” కింద అరెస్టయితే, 356 మందిపైనే నేరాభి యోగాలు రుజువయ్యాయి. ”ఉపా” కేసుల బనాయింపు పాలకుల కనుసన్నల్లోనే సాగుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ఇలాంటి ”ఉపా”ను ఈ దేశ పౌరసమాజం ముక్తకంఠంతో నిరసించాల్సిన అవసరం ఉంది.సాయిబాబా మరణం తోనైనా ప్రజలు, పౌర సంఘాలు మేల్కోవాలి. “ఉపా” చట్టం రద్దు కోసం దేశవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి.
చివరిగా…ఒక మాట.
సాయిబాబా మరణం తీవ్రంగా కలిచివేసే ఘటన. నమ్మశక్యం కాని అన్యాయానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలబడిన ఘటన. ఈ దేశ చరిత్రలోనే వీల్ చైర్‌కు పరిమితమైన ఒక మేధావిని చిత్రహింసలకు గురిచేసి చావు అంచుల్లోకి తీసుకెళ్లాక విడుదల చేసిన ఘటన. మన రాజ్యవ్యవస్థ వింతైన కథ. కష్టతరమైన చట్టాలతో, న్యాయవ్యవస్థతో సుధీర్ఘ కాలం పోరాటం చేసి మరణాన్ని నిరాకరించిన ఒక వీరుని కథ. తనకంటూ ఓ జీవితమే లేకుండా చేసిన ఈ దేశపు కథ. చక్రాల కుర్చీలోంచి..చరిత్ర పుటల్లో లిఖించబడిన ”ప్రొఫెసర్ సాయిబాబా” కథ. ఆయన భౌతికంగా లేకపోయినా చరిత్ర ఎప్పటికప్పుడు ఆయన ఆనవాళ్లను గుర్తు చేస్తూనే ఉంటుంది. రాజ్యాన్ని నిలదిస్తూనే వుంటుంది.
DARA
Editor in chief
jananirnayam.com
1 thought on “చక్రాల కుర్చీలోంచి..చరిత్ర పుటల్లోకి…”