
- చార్వాక – సైంటఫిక్ స్టడీ ఫోరం (SSF) ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్, సెల్ : 9347284111
National science day article by charvaka : మనం నిత్య జీవితంలో ఉదయం లేవడం నుండి రాత్రి పడుకునే వరకు ప్రత్యక్షంగా గానీ లేదా పరీక్షంగా గానీ మనము ఉపయోగించే ఎన్నో వస్తువులు, పరికరాలు సైన్సు సూత్రాలపైన ఆధారపడి తయారు చేసిన వాటినే మనం వాడుతున్నాం. శాస్త్రవేత్తలు నూతన ఆవిష్కరణల ఫలితాల కోసం కొన్ని సందర్బాలలో కొన్ని సంవత్సరాలపాటు శ్రమించి వారి వ్యక్తిగత సుఖాలను సైతం త్యాగం చేస్తారు. కొంతమంది శాస్త్ర వేత్తలు తమ జీవితాలను సైతం త్యాగం చేసినవారున్నారు. ఇంకొందరైతే తమ తదనంతరం వారు చేసిన పరిశోధనల ఫలితాలను మానవజాతికి అందించినవారున్నారు. మన ముందు తరం శాస్త్రవేత్తలు ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా కేవలం సమాజ శ్రేయస్సు కోసం వారు ఎంతో కృషి చేస్తేనే నేడు మనమంతా విలాసవంతమయిన జీవితాన్ని అనుభవించ గలుగుతున్నాం. ఎంతో మంది శాస్త్రవేత్తలు ముఖ్యంగా మన దేశ శాస్త్ర వేత్తలు వారికి అందుబాటులో ఉన్న పరికరాలతోనే ఎన్నో ప్రయోగాలు చేసి ఎంతో అద్భుత మైన ఆవిష్కరణలు చేసిన వారు ఎందరో ఉన్నారు. ఇటువంటి శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు ఎన్నో విజయవంతమై మన దేశానికీ గర్వకారణంగా నిలిచాయి. కేవలం 200 రూపాయలు ఖర్చుతో 1930వ సంవత్సరంలోనే రామన్ ఎఫెక్ట్‌ను కనుగొని నోబెల్ బహుమతి సాధించిన మొట్టమొదటి ఆసియా ఖండంలోని భౌతిక శాస్త్రవేత్త సి.వి.రామన్ పూర్తి పేరు చంద్రశేఖర వెంకట రామన్, జననం నవంబర్ 7, 1888 – మరణం నవంబర్ 21, 1970. మన దేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త. సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ ను కనిపెట్టాడు. 1930 డిసెంబరులో రామన్ ఎఫెక్ట్ కు నోబెల్ బహుమతి వచ్చింది. 1954 వ సంవత్సరంలో మన దేశ ప్రభుత్వం ఆయనను భారతరత్న పురస్కారంతో సత్కరించింది. ఆయన పరిశోధన ఫలితాన్ని ధ్రువపరిచిన రోజును ఫిబ్రవరి 28వ తారీఖున జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది.
National science day article by charvaka :
బాల్యం, విద్యాభ్యాసం
చంద్రశేఖర్ వెంకటరామన్ (c.v. రామన్)1888 నవంబరు 7వ తేదీన తిరుచినాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. తండ్రి పేరు చంద్రశేఖర్ అయ్యర్, వారిది మధ్య తరగతి కుటుంబం. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. సి.వి.రామన్ చిన్నతనం నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు. ఆయన తండ్రి భౌతిక అధ్యాపకులవడం, అతనిని భౌతికశాస్త్రం వైపు మరింత కుతూహలం పెంచుకునేలా చేసింది. చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తనకు 12 సంవత్సరాల వయసులో మెట్రిక్యులేషన్ (ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించి) పూర్తి చేశాడు. 1907లో ఎం. ఎస్.సి (ఫిజిక్స్)లో యూనివర్సిటీకి ప్రథముడిగా నిలిచారు. తన 18 వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై ఈయన పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్లో ప్రచురితమైంది. ఆయనలోని పరిశోధనాభిరుచిని పరిశీలించిన అధ్యాపకులు ప్రోత్సహించి ఇంగ్లాండు వెళ్ళి పరిశోధన చేయమన్నారు. కానీ ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో ఒక వైద్యుడు అయన ఇంగ్లాండు వాతావరణానికి సరిపడడని తేల్చడంతో అతను ఇంగ్లాండు ప్రయాణం విరమించుకున్నాడు. నన్ను అన్ఫేట్ అన్న ఆ డాక్టరుకు నేనెంతో రుణపడి ఉన్నాను. అని తర్వాత రామన్ పేర్కొన్నారు. ఎమ్మే చదివి ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం చేశారు..
National science day article by charvaka :
ఉద్యోగం :
1907లో ఉద్యోగరీత్యా కలకత్తాకు బదిలీ అయ్యారు. అక్కడ ఇండియన్ సైన్స్ అసోసియేషను రోజూ వెళ్ళి పరిశోధనలు చేసుకునేవారు. రామన్ ఆసక్తిని గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతి అశుతోష్ ముఖర్జీ బ్రిటీష్ ప్రభుత్వానికి లేఖ రాస్తూ… రామన్ సైన్స్ పరిశోధనలను పూర్తి కాలానికి వినియోగించుకుంటే బాగుంటుందని సూచించారు. కానీ, బ్రిటీష్ ప్రభుత్వం అంగీకరించలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి పరిశోధనలు కొనసాగించాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసిఎస్బి పాసై కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ గా చేరారు. ఉద్యోగంలో చేరే ముందు లోకసుందరి అమ్మాళ్ తో పెళ్ళయింది. ఒకసారి కలకత్తాలో ప్రయాణం చేస్తున్నప్పుడు బౌటజారు స్ట్రీట్ వద్ద ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూసి పరుగు పరుగున వెళ్ళాడు. ఆ సంస్థ గౌరవ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్‌ను కలిసి పరిశోధన చేయడానికి అనుమతిని పొందాడు. పరిశోధనలపై ఉన్న ఆసక్తి వలన తెల్లవారుజామున ఐదున్నరకే ఐసిఎస్ బికు వెళ్ళేవారు. తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం, తిరిగి సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశోధన, ఆదివారాలు, సెలవు దినాలు పరిశోధనలోనే గడిపేవారు. అతని తల్లి పార్వతి అమ్మాళ్కు సంగీతంలో మంచి అభిరుచి ఉండేది. ఆమె వీణను అద్భుతంగా వాయించేది. అందుకే రామన్ తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం వంటి సంగీతవాయిద్యాల గురించి సాగాయి. విజ్ఞాన పరిశోధన తృష్ణ వలన తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసరుగా చేరారు.
National science day article by charvaka :
1921లో లండన్‌లో తను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్ద రహస్యంపై ఉపన్యాసాలు ఇచ్చాడు. అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళలో ఒకరు ఇలాంటి అంశాలతో రాయల్ సొసైటీ సభ్యుడవు కావాలనుకుంటున్నావా అన్నాడు.ఆ సంఘటనతో ఆయనలో పరిశోధనలపై మరింత ఆసక్తి పెరిగింది. శబ్దశాస్త్రం నుంచి తన పరిశోధనలను కాంతి శాస్త్రం వైపు మార్చాడు. తన తిరుగు ప్రయాణంలో ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రంలోని నీరు నీలిరంగులో ఉండటం ఆయనను ఆలోచింపచేసింది. అప్పటిదాకా అనుకుంటున్నట్లు సముద్రపు నీలి రంగుకు కారణం ఆకాశం నీలిరంగు సముద్రం మీద ప్రతిఫలించడం కాదు, సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపనం చెందడమే కారణం అని ఊహించాడు. కలకత్తా చేరగానే తన ఊహను నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘనపదార్ధాలు కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు. అందుకు యువశాస్త్రవేత్తలైన కె.ఆర్.రామనాధన్, కె.యస్ . కృష్ణన్ ఆయనకు అండగా నిలిచారు. 1927 డిసెంబరులో ఒకరోజు సాయంత్రం కె.యస్.కృష్ణన్ రామన్ వద్దకు పరుగెత్తుకొని వచ్చి కాంప్టన్ (భౌతిక శాస్త్రవేత్త)కు నోబెల్ బహుమతి వచ్చిందని ‘ఆనందంతో చెప్పగానే రామన్ ఎక్సలెంట్ న్యూస్ అని సంతోషపడ్డాడు.కాంప్టన్ ఫలితం ఎక్స్ కిరణాల విషయంలో నిజమైనపుడు, కాంతి విషయాలలో నిజం కావాలి కదా అనే ఆలోచనలో పడ్డాడు. ఆ ఆలోచనే రామన్ ఎఫెక్టుకు దారితీసింది. తగినంత అధునాతనమైన పరికరాలేవి లేకపోయినా, రామన్ తన ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని నమ్మకంగా ఉన్నాడు. అతను అనుకున్నట్లే 1928 ఫిబ్రవరి 28 న రామన్ ఎఫెక్టు అంటే పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఈ దృగ్విషయాన్ని 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞులసదస్సులో చూపించాడు. అందుకే బ్రిటీష్ ప్రభుత్వం 1929లో c.v. రామన్ కు ప్రఖ్యాత నైట్‌హుడ్ బిరుదుతో సత్కరించింది. ఈ రామన్ ఎఫెక్టు అసామాన్యమైనదని, అందులో 200 రూపాయలు కూడా విలువ చేయని పరికరాలతో ఆ దృగ్విషయ నిరూపణ జరగడం అద్భుతమైనదని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ రామన్ ను అభినందించారు. ఈయన పరిశోధన యొక్క విలువను గుర్తించి 1930లో నోబెల్ బహుమతి ప్రదానం చేశారు. ఆ మహనీయుని సేవలను భారత ప్రభుత్వం గుర్తించి 1954లో ‘భారతరత్న’ అవార్డు బహుకరించిన సమయంలో సందేశాత్మక ఉపన్యాసం ఇస్తూ ‘విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన -స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి’ అన్న మాటలు నేటికి ఆలోచింపచేసేవి. మాతృభూమిలో చివరి వరకు సైన్స్ అభివృద్ధికి పాటుపడ్డ ఆ మహనీయుడు 1970 నవంబర్ 21 న భౌతికంగా కన్నుమూసారు.
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 న జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించి,ఆయనను చిరంజీవిగా మనమధ్య నిలిచేలా కొన్ని సంస్థలు ఆయన పేరు మీద టాలెంట్ టెస్టులు, విజ్ఞాన శాస్త్ర క్విజ్ పోటీలు, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నాయి. విద్యార్థినీ, విద్యార్థుల్లో ఆయన స్పూర్తిని నింపుతూ సైన్స్(విజ్ఞాన శాస్త్రం) అంటే మక్కువ కలిగిలా చేస్తున్నాయి. 1928లో ఫిబ్రవరి 28న ఈయన రామన్ ఎఫెక్టును కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశంలో ఫిబ్రవరి 28వ తారీఖును జాతీయ విజ్ఞాన దినోత్సవంగా (నేషనల్ సైన్స్ డే) జరుపుకొంటున్నాము.
National science day article by charvaka
విజ్ఞాన శాస్త్ర ఆవశ్యకత :
విశ్వం ఆవిర్భావం మరియు జీవం పుట్టుక, పరిణామ క్రమం అన్నింటికీ విజ్ఞాన శాస్త్రం సమాధానం చెబుతుంది. శాస్త్రీయంగా నిరూపితమైనటువంటి ఈ విషయాలను విద్యార్థి దశలోనే వివరించినట్లయితే పిల్లల్లో శాస్త్రీయ దృక్పథం అలవడుతుంది. ఆదిమ మానవుడి నుండి నేటి ఆధునిక మానవుడి అభివృద్ధి చెందడానికి శాస్త్ర విజ్ఞాన ఫలితాలే కారణం. నేడు విద్యార్థులకు చార్లెస్ డార్విన్ చెప్పినటువంటి జీవపరిణామక్రమ సిద్ధాంతాన్ని సిలబస్ లో నుండి తొలగించడం అంటే విజ్ఞాన శాస్త్ర ఫలితాలను విద్యార్థులకు దూరం చేయడమే కాకుండా అశాస్త్రీయ భావజాలాన్ని విద్యార్థి దశలోనే వారి మెదడులలో నింపే ప్రయత్నం అవుతుంది. శాస్త్రీయ అవగాహన శాస్త్రీయ దృక్పథం కొరవడినటువంటి మనుషులలో ప్రశ్నించే తత్వం ఉండదు. కేవలం ఆచరించే మనుషులుగా మిగిలిపోతారు. అటువంటి పరిస్థితి సమాజానికి చాలా ప్రమాదకరం. కరోన వైరస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ప్రజలను బలిగొంటున్న తరుణంలో ఇండియాలో చప్పట్లు కొట్టడం, పల్లెలను మోగించడం, దీపాలను వెలిగించడం వంటి అశాస్త్రీయ పనులు చేయడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా ఇటువంటి చర్యల వలన సమాజాన్ని మధ్యయుగాల నాటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మన పాలకులు. భారతరాజ్యాంగం అధికరణ 51 A(H) శాస్త్రీయ విజ్ఞానాన్ని,మానవతావాదాన్ని పెంపొందించడం ప్రతిపౌరుని కర్తవ్యం, అని పేర్కొన్నది. నేటికీ సమాజంలో చెడుపు, చిల్లంగి, భాణామతి పేరుతో నేటికీ దాడులు, హత్యలు, జరుగుతున్నాయి. ఇంకో వైపు మహిమగల ఉంగరాలు, చెంబులు, తాయెత్తులు,రాశి చక్రాలు పేరుతో మోసాలు చేస్తున్నారు. భూత వైద్యులు శారీరక మరియు మానసిక రోగాలు నయం చేస్తామని, ప్రజలను మోసాలు చేస్తున్నారు. ఇటువటివారిని నమ్మి వేల రూపాయలు ఒక్కోసారి లక్షల రూపాయలు నష్టపోతున్నారు.TV సీరియల్లు కొన్ని పత్రికలు, అశాస్త్రీయ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నాయి. C.V. రామన్ వంటి శాస్త్రవేత్తలు చేసిన కృషిని, నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి 28 మరియు ఇంటర్నేషనల్ సైన్స్ డే నవంబర్ 10 యొక్క ప్రత్యేకతలను పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు వివరిస్తూ విద్యార్థిని, విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని కోరుకుందాం. శాస్త్రీయ సమ సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం.
National science day article by charvaka :
మూఢనమ్మకాలపై ప్రాముఖ్యమైన శాస్త్రవేత్తలు ఏమన్నారంటే…సర్ సి.వి. రామన్ “అవగాహన లేకుండా విశ్వసించడం మనకెప్పుడూ ప్రమాదకరం. ఎప్పుడూ సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అన్నార. ” భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి మాటల్లో “భారతదేశ అభివృద్ధి కోసం మేము శాస్త్రీయ ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి. అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడాలి.”అని ఈ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారు
“ఇది 21వ శతాబ్దం. మనం మూఢనమ్మకాలను విడిచిపెట్టి, విజ్ఞానాన్ని స్వీకరించాలి.” అని తెలియజేశారు.భారతదేశం శాస్త్రవిజ్ఞాన రంగంలో ప్రాముఖ్యతను సాధించింది. నోబెల్ బహుమతి గ్రహీతలైన సి.వి. రామన్, హార్గోవింద్ ఖురానా, వెంకట్రామన్ రాధాకృష్ణన్, అభిజిత్ బెనర్జీ లాంటి శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
ISRO – చంద్రయాన్, మార్స్ ఆర్బిటర్ మిషన్, గగన్‌యాన్ ప్రాజెక్ట్ వంటి స్పేస్ మిషన్ల ప్రాజెక్టుల వల్ల ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించింది. DRDO – రక్షణ రంగంలో ఆధునిక సాంకేతికతలను ఆవిష్కరిస్తూ విజ్ఞాన పదంలో ముందుకు తీసుకువెళ్లాలి.CSIR & IIT లు ప్రతిష్టాత్మక పరిశోధనల్లో కీలక పాత్ర పోషించాలి. ఇందుకు తగ్గినట్టుగా విద్యార్థి దశలోనే ప్రశ్నించే తత్వాన్ని మరియు శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండడం నేర్పించగలిగితే ఇవన్నీ మనకు సాధ్యం కానీ విషయాలు కాదు.
ఫిబ్రవరి 28,జాతీయ శాస్త్రియ దినోత్సవం (NATIONAL SCIENCE DAY)సందర్భంగా…