భూపాలపల్లి జిల్లా మేనేజర్ రాజు నాయక్
108, 102 services as a boon to pregnant women and the public : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు, గర్భిణులకు, బాలింతలకు, వృద్ధులకు వరంగా 108, 102 అంబులెన్స్ సేవలు నిరంతరం అందుబాటులో ఉన్నాయని జిల్లా మేనేజర్ రాజు నాయక్ తెలిపారు. అత్యవసర సమయంలో వేగంగా స్పందిస్తూ, సమయానికి రోగులను ఆసుపత్రులకు తరలించడం ద్వారా అనేక ప్రాణాలను కాపాడుతున్నామని ఆయన చెప్పారు.
ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలకు ప్రసవ సమయంలో 102 వాహనాల ద్వారా సురక్షితంగా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలిస్తూ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, స్ట్రోక్, ఇతర అత్యవసర కేసులలో 108 సేవలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో అంబులెన్స్ వాహనాలు 24 గంటలు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని, కాల్ వచ్చిన వెంటనే సిబ్బంది వేగంగా స్పందించేలా పర్యవేక్షణ కొనసాగుతోందని రాజు నాయక్ వెల్లడించారు. ప్రతి కేసును సమయానికి ఆసుపత్రికి చేర్చడం మా ప్రధాన లక్ష్యమని అన్నారు.
108, 102 services as a boon to pregnant women and the public
వేసవి కాలం నేపథ్యంలో జాగ్రత్తలు
రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా మేనేజర్ రాజు నాయక్ సూచించారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్, అలసట, తలనొప్పి, వాంతులు వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల వరకు ఎండలో బయటకు వెళ్లకుండా ఉండాలని, అవసరమైతే తల కప్పుకుని వెళ్లాలని సూచించారు.
పుష్కలంగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవాలు తీసుకోవాలని, వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. శరీరంలో బలహీనత, అధిక జ్వరం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే 108కు కాల్ చేసి వైద్య సహాయం పొందాలని కోరారు. భూపాలపల్లి జిల్లాలో అత్యవసర సేవల శాతం పెరగడానికి సిబ్బంది కృషి ఎంతో ఉందని, ప్రజలు కూడా 108, 102 సేవలను సమయానికి వినియోగించుకోవాలని జిల్లా మేనేజర్ రాజు నాయక్ విజ్ఞప్తి చేశారు.
